iDreamPost
android-app
ios-app

ఫోన్ నంబర్ ఇవ్వకుంటే.. గ్యాంగ్ రేప్ చేస్తాం : బార్ లో యువతికి వేధింపులు

  • Published Jun 22, 2022 | 12:00 PM Updated Updated Jan 02, 2024 | 6:42 PM

యువకులు బాధిత యువతిని ఫోన్ నంబర్ అడగ్గా.. ఇవ్వలేదు. ఫోన్ నంబర్ ఇవ్వనని చెప్పడంతో ఆ యువకులు తనను సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరించినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుల వాదన మరోలా ఉంది.

యువకులు బాధిత యువతిని ఫోన్ నంబర్ అడగ్గా.. ఇవ్వలేదు. ఫోన్ నంబర్ ఇవ్వనని చెప్పడంతో ఆ యువకులు తనను సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరించినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుల వాదన మరోలా ఉంది.

ఫోన్ నంబర్ ఇవ్వకుంటే.. గ్యాంగ్ రేప్ చేస్తాం : బార్ లో యువతికి వేధింపులు

హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ కు సమీపంలో ఉన్న ఓ స్టార్ హోటల్ బార్ లో జరుగుతున్న ఫంక్షన్ కు వచ్చిన యువతిపట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. యువకులు బాధిత యువతిని ఫోన్ నంబర్ అడగ్గా.. ఇవ్వలేదు. ఫోన్ నంబర్ ఇవ్వనని చెప్పడంతో ఆ యువకులు తనను సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరించినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుల వాదన మరోలా ఉంది. యువతి స్నేహితులే ఉద్దేశపూర్వకంగా తమపై దాడికి పాల్పడ్డారని యువకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించి, ఇరువర్గాలపై రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేశారు.

రాజస్థాన్ కు చెందిన 24 ఏళ్ల యువతి హైదరాబాద్ లో ఉంటూ.. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో పనిచేస్తోంది. వృత్తిరీత్యా ఆమె న్యూట్రిషనిస్ట్. ఏడాది తర్వాత కలిసిన తన స్నేహితులు విక్రమ్, విష్ణులతో కలిసి శనివారం రాత్రి 11.30 గంటలకు రాయదుర్గంలోని ఓ స్టార్ హోటల్ లోని బార్ కు వెళ్లారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటుండగా.. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో సాద్, మయాంక్ అగర్వాల్ అనే ఇద్దరు యువకులు ఆ యువతి వద్దకు వెళ్లి ఫోన్ నంబర్ అడిగారు. ఫోన్ నంబర్ ఇచ్చేందుకు యువతి నిరాకరించింది. దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన విష్ణు, విక్రమ్ లు సాద్, మయాంక్ లను వారించారు. నలుగురి మధ్య వాగ్వాదం పెరగడంతో సాద్ విష్ణు, విక్రమ్ లపై దాడికి పాల్పడ్డాడు. మరో ఆరుగురు స్నేహితులను బార్ కు పిలిపించి దాడి చేయడంతో విష్ణు గాయపడ్డాడు.

అదే సమయంలో యువతిని తాకుతూ.. అసభ్యంగా ప్రవర్తించారు. కారులో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేస్తామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించారు. ఇంతలో బార్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపేశారు. సాద్ దాడిలో గాయపడిన విష్ణు తలకు ఐదు కుట్లు పడినట్లు తెలిపాడు. విక్రమ్ కొట్టడంతో తనకూ గాయాలయ్యాయని సాద్ చేప్తున్నాడు. సాద్, మయాంక్ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు, బాధిత యువతి, విష్ణు, విక్రమ్ లు సోమవారం సాయంత్రం రాయదుర్గం పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.