తమదారి తాము చూసుకున్నారా..?!

రాజకీయ పార్టీల్లో కరుడు గట్టిన కార్యకర్తలు ఉంటారు గానీ, కరుడు గట్టిన నాయకుడు ఉండరనేది లోకోక్తి మాదిరిగా రాజకీయోక్తి. అంటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి జెండాలు మోసి, బ్యానర్లు కట్టి, జైజైలు కొట్టేందుకు గొంతులు పోగొట్టుకునేది కార్యకర్తలే. వీళ్ళు పోగయ్యే సంఖ్యను బట్టే నాయకుల విలువ మారుతూ.. పెరుగుతూ.. ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పార్టీ విజయం సాధించిందీ అంటే ఆ పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలు ఎక్కువయ్యారని కూడా అర్ధం చేసుకోవచ్చు. పార్టీల పరాజయానికి దీన్ని రివర్స్‌లో కూడా భావించొచ్చు.

ఆ పార్టీ మరీ ఘోరంగా ఓడిపోయిందీ అంటే ఆ పార్టీ నాయకులు, కరుడుగట్టిన కార్యకర్తల మధ్య ఏర్పడిన గ్యాప్‌ ఓ కారణంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన టీడీపీకి కరుడుగట్టిన కార్యకర్తలకు లోటుండదన్న అభిప్రాయం ఆ పార్టీకి ప్రత్యర్ధుల నుంచి కూడా విన్పిస్తుంటుంది. అయితే గత వైభవ కాలంలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు మంచి పొజిషనే ఉన్నప్పటికీ రాన్రాను విలువ తగ్గడం చోటు చేసుకుందంటుంటారు. ఇలా కార్యకర్తలను పట్టించుకోని ప్రభావం ఇప్పుడు జీహెచ్‌యంసీ ఎన్నికల్లో టీడీపీపై నేరుగా పడిందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. 106 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానంలో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదంటే కరుడుగట్టిన కార్యకర్తలను ఆ పార్టీ ఎంతగా దూరం చేసుకుందన్నది అర్ధం చేసుకోవచ్చని చెబుతున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదు పరిధిలో అత్యధిక సీట్లు గెల్చుకున్న రికార్డు టీడీపీకి ఉంది. అయితే ఆరేళ్ళలో అదే హైదరాబాదు మున్సిపల్‌ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోవడాన్ని చూస్తుంటే.. అక్కడున్న కార్యకర్తలు ఎంతగా కకావికలం అయ్యారో అంచనా వేయొచ్చంటున్నారు. ఇక్కడ ప్రత్యర్ధిపార్టీల రాజకీయ వ్యూహాలకంటే కూడా టీడీపీ సొంత తప్పిదాల వల్లనే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొందనడంలో ఎటువంటి సందేహపడనవసరం లేదంటున్నారు.

టీడీపీకి ఇప్పుడు ప్రధాన బేస్‌ ఏపీలోనే ఉంది. అయినప్పటికీ కోవిడ్‌పేరు జెప్పి గత ఏడెనిమిది నెలలుగా హైదరాబాదులోనే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఉంటున్నారు. కానీ తెలంగాణాలోనూ, ఆ మాటకొస్తే కనీసం గ్రేటర్‌ పరిధిలోని టీడీపీ కార్యకర్తలతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీని ఫలితమే ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రతిఫలించిందని వివరిస్తున్నారు. తమ ఊళ్ళోనే ఉంటున్నప్పటికీ తమను పట్టించుకోకపోవడంతో కరడుగట్టిన టీడీపీ శ్రేణులు తలోదిక్కును చూసుకున్నాయని చెబుతున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతం కూడా ఇక మరోసారి చెప్పుకునేందుకు వీలులేని రీతిలో ధ్వంసమైపోయిందంటున్నారు. గ్రేటర్‌ ఫలితాలను పరిశీలించిన మీదట ఏపీలో కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో భిన్న నమ్మకాలు కలగుతాయంటున్నారు పరిశీలకులు. ఇక్కడ కూడా పార్టీ కేడర్‌ను పట్టించుకునే పరిస్థితి నాయకుల్లో కన్పించడం లేదంటున్నారు. అధినేత జూమ్‌లో కాలక్షేపం చేస్తుంటే.. ఆయన ఆదేశాలు అందుకుంటున్న అగ్ర నాయకులు కూడా జూమ్‌ వరకు మాత్రమే సిద్ధమవుతున్నారని ఆక్షేపిస్తున్నారు.

ఏపీలో అత్యంత బలమైన ప్రజా మద్దతుతో ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనేందుకు ఈ తరహా సమాయత్తం సరిపోదని క్షేత్రస్థాయి కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాణక్యుడు అని సొంత బృందం చేత పొగిడించుకున్న చంద్రబాబు ఏ వ్యూహం పన్ని పార్టీని రానున్న ఎన్నికల్లో గట్టెక్కిస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగానే ఎదురు చూస్తున్నాయి.

Show comments