Dharani
Dharani
నేటికాలంలో.. మెరుగైన వైద్య, విద్య పొందడం అంటే.. లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు ఉండవు.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. ఆస్తులతో పాటు అవయవాలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. చేసేది ఏంలేక దేవుడి మీద భారం వేసి.. ప్రభుత్వ దవాఖానలకే వెళ్తున్నారు పేదలు. గవర్నమెంట్ హస్సిటల్స్‌లో అన్ని పరికరాలు అందుబాటులో ఉండవు. దాంతో టెస్ట్‌లు బయట చేయించుకోవాల్సిన పరిస్థితి. అందుకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈ సమస్యకు కేసీఆర్ సర్కార్ పరిష్కారం చూపింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పలు వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇకపై గవర్నమెంట్ హస్పిటల్స్‌లో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా అందించే ఈ వైద్య పరీక్షలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. అలానే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నొస్టిక్స్ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఉచితంగా చేస్తున్నారు. వీటితో పాటు మరో 134 ఉచిత వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చాం. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల మొబైల్ నంబర్‌కు పంపిస్తాం. అలానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలకు సంబంధించి టిఫా స్కాన్, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.
అంతేకాక జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చాలా కష్టపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారు. గవర్నమెంట్ హస్పిటల్స్‌ని కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులకు ధీటుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ చేసుకునే గర్భిణీలకు కేసీఆర్ కిట్, అలానే వారి కోసం కేసీఆర్ పౌష్టికాహార కిట్ అందిస్తోంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగితే.. కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇప్పుడు అవి 70శాతం అవుతున్నాయి. అంతేకాక పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం’’ అని హరీశ్‌రావు వెల్లడించారు.