iDreamPost
android-app
ios-app

మొన్న ఎడమ కాలి చెప్పు.. ఇప్పుడు ప్రజల భిక్ష

  • Published Apr 15, 2021 | 9:34 AM Updated Updated Apr 15, 2021 | 9:34 AM
మొన్న ఎడమ కాలి చెప్పు.. ఇప్పుడు ప్రజల భిక్ష

‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు’.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు సరిగ్గా సెట్ అవుతుంది. తనకు సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అని ఇటీవల చెప్పిన కేసీఆర్.. ఇప్పుడేమో ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రజల భిక్ష అని అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నెగ్గేందుకు.. హాలియా బహిరంగ సభలో తగ్గి మాట్లాడారు. ఇప్పుడే కాదు.. సందర్భాన్ని బట్టి, ఎన్నికలను బట్టి.. ఆయన స్వరం మారుతుంటుంది.. మాట తీరు మారుతుంటుంది. టార్గెట్ మారుతుంటుంది.

అప్పుడలా.. ఇప్పుడిలా..

గత ఫిబ్రవరిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో జరిగిన మీటింగ్ లో కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ సీఎం అంటూ అందరూ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మార్పుపై ఇష్టమున్నట్లు మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్తానని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కాళ్లను పట్టుకొని బండకేసి కొడుతానని హెచ్చరించారు. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ఆగం కావొద్దనే సీఎం అయ్యానని, సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేసీఆర్ పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రజలు ఓటు వేసి అప్పగించిన పదవిని అవమానిస్తారా అంటూ నిలదీశాయి. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ విమర్శలను కేసీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు సమయం రాగానే లెక్క సరిచేశారు. తనకు సీఎం పదవి తెలంగాణ ప్రజల భిక్ష అని చెప్పారు. ఇటు విమర్శలకు సమాధానం చెప్పారు.. అటు సాగర్ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.

కాంగ్రెస్సే టార్గెట్.. బీజేపీ ఊసే లేదు..

నాగార్జున సాగర్ లో ప్రధాన పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. బీజేపీ అభ్యర్థి పోటీ ఇచ్చినా.. మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక టీడీపీ పేరుకే పోటీలో ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్, జానారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. ఎక్కడా బీజేపీ ఊసే ఎత్తలేదు. జానారెడ్డి మాట్లాడితే తనది 30 ఏళ్ల చరిత్ర, 60 ఏళ్ల చరిత్ర అంటారని, కానీ సాగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు పదవుల కోసం వంగి, లొంగి పెదవులు మూసుకున్నోళ్లని ఆరోపించారు. ఫ్లోరైడ్ తో భాధపడిన నల్గొండకు ఏం చేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు తెలంగాణ ఒక అనాథగా ఉండేదని, అందుకు కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు.

Also Read : తెలంగాణాలో మరో ఎన్నికకు మోగిన నగారా

గత ఎన్నికల్లోనూ ఇలానే..

2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పోటీ చేయడాన్ని ఆయన టార్గెట్ చేశారు. మళ్లీ ఆంధ్రోళ్ల పాలన కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు. దశాబ్దాల పాటు ఆంధ్రా వాళ్ల పాలనలో మోసపోయింది చాలదా అని అన్నారు. ఇది జనం మనసుల్లోకి చొచ్చుకెళ్లింది. టీఆర్ఎస్ విక్టరీ కొట్టింది. అయితే అంతకు రెండేళ్ల ముందు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ వేరే వ్యూహం అవలంబించారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏపీవాసుల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్లు కూడా తమ వాళ్లేనని, హైదరాబాదీలేనని అన్నారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. ఈ ప్లాన్ పని చేసింది. టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ అని, సారు కారు పదహారు అని.. 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం కారు బోల్తా కొట్టింది. ఆ విషయం పక్కన పెడితే.. ఒక్కో ఎన్నికలో ఒక్కో తీరుగా కేసీఆర్ ప్రచారం చేశారు.

హామీలే హామీలు..

ఎన్నికలు వచ్చాయంటే చాలు కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తారు. తాజాగా సాగర్ నియోజకవర్గ ప్రజలకు భారీగా హామీలు ఇచ్చారు. సాగర్లో డిగ్రీ కాలేజీ, హాలియాలో షాదీఖానా ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, 57 ఏండ్లు దాటిన వాళ్లకు పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. నెల్లికల్లుతోపాటు దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గొర్రెల సబ్సిడీ ధర పెంచుతామని, త్వరలో మూడు లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు.

పొలిటికల్ మాటల మాంత్రికుడు

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మాటల మాంత్రికుడు అని అంటారు. కానీ పాలిటిక్స్ లో మాత్రం కేసీఆర్ మాటల మాంత్రికుడు. యాస, ప్రాసతో పదునైన డైలాగులు చెబుతుంటారు. నిజానికి ఆయనకు మాట తీరే బలం. కేసీఆర్ లైవ్ లో మాట్లాడుతున్నారంటే జనం ఆసక్తిగా చూస్తుంటారు. పంచులు అలా వేస్తారాయన. తాజాగా జరిగిన సభలోనూ ఇలానే కొన్ని డైలాగ్స్ చెప్పారు. ‘‘పదవుల కోసం వంగి లొంగి పెదవులు మూసుకున్నోళ్లు కాంగ్రెసోళ్లు’’.. ‘‘గాడిదలకు గడ్డేసి, ఆవులకు పాలు పిండితే రావు’’.. ‘‘ముళ్ల చెట్టు పెట్టి పండ్లు కాయాలంటే కాయవు’’.. ‘‘అవకాశం ఉన్నోళ్లు, అధికారం ఉన్నోళ్లు ఆక్రమించుకున్నారు’’.. ‘‘ఎట్లెట్ల భగత్కు ఓట్లు దుంకుతాయో అట్లట్ల మీ నెల్లికల్ లిఫ్ట్ నీళ్లు కూడా దుంకుతయ్..’’ అంటూ పంచ్ లు వేశారు.

Also Read : కేటీఆర్​ కు అంత కోపం ఎందుకు వచ్చింది ?