లాక్ డౌన్ తవ్వకాల్లో బయటపడ్డ నిజాలేంటో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచ దేశాలు చాలా రోజులుగా లాక్ డౌన్లోనే ఉండిపోయాయి. గడచిన రెండు జనరేషన్లలో బయటపడని నగ్నసత్యాలు ఈ లాక్ డౌన్లో బయటపడ్డాయి.

బయటపడ్డ నిజాలు జాతీయ, అంతర్జాతీయంగా వర్గీకరిస్తే చాలా మంచి విషయాలే మన ముందు ఆవిష్కృతమవుతాయి. ముందుగా జాతీయ స్ధాయినే తీసుకుంటే ప్రపంచంలోని చాలా దేశాలను వణికించేస్తున్న వైరస్ తీవ్రత భారతదేశంపై పెద్దగా లేదనే చెప్పాలి.

తీవ్రత ఎందుకు లేదంటే విదేశీయులతో పోల్చినపుడు భారతీయుల్లో చాలామందికి రోగ నిరోధక శక్తి ఎక్కువని తేలింది. అలాగే లాక్ డౌన్ కు ముందు వరకు 24 గంటలు బిజీగా ఉన్నామని అనుకునే చాలామంది ఇపుడు ప్రశాంతంగా ఎవరికి వారుగా తమ ఇళ్ళల్లోనే గడుపుతున్నారు. మరి 24 గంటలు బిజీ అనే భావన ఏమైంది ? ఏమైందంటే చెప్పుకున్న బిజీ అంతా మనకు మనంగా కల్పించుకున్నదే అని తేలిపోయింది. మనదేశంలో కూడా మారిపోతున్న జీవన శైలి కారణంగా చాలా ఇళ్ళల్లో పేరంట్స్ వాళ్ళ పిల్లల బాగోగులపై పెద్దగా శ్రద్ద పెట్టే అవకాశం లేనివాళ్ళే. కానీ లాక్ డౌన్ సందర్భంగా ఇపుడు ఇంటి గురించి పిల్లల మంచి చెడ్డా పట్టించుకుంటున్నారంటే సంతోషమే కదా ?

సమాజంలో నిజమైన హీరోలెవరయ్యా అంటే డాక్టర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులే అని తేలింది. ఉరుకుల పరుగుల జీవితాన్ని మనకు మనమే సృష్టించుకున్నామని, నిజంగా మనసుంటే తీరికైన జీవితం గడపటం అంత కష్టమైన పని కాదని నిరూపణైంది. ఎంతటి కష్టతరమైన సమస్యలు వచ్చి మీదపడినా నిబ్బరంగా ఎదుర్కోనే మనోధైర్య భారతీయులకు ఉందని మరోసారి నిరూపితమైంది.

ఇక అంతర్జాతీయంగా చూస్తే అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో వైద్య రంగంలోని డొల్లతనం బయటపడింది. ప్రపంచం ఏమైనా పర్వాలేదన్న అమెరికా ధోరణి మరోసారి బయపడింది. ఎలాగయ్యా అంటే చైనా నుండి విమానంలో ఫ్రాన్స్ కు వెళ్ళాల్సిన మాస్కులు తదితర వైద్య పరికరాలను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్ళిపోయింది. ప్రపంచం బాగు గురించి చైనా ఏనాడు ఆలోచించదన్న విషయం కూడా అర్ధమైపోయింది.

ఎలాగంటే వైరస్ వూహాన్ లో ఎటాక్ అయిన విషయం, పోరాడుతున్న విషయాన్ని చాలా రోజులు బయటప్రపంచానికి తెలీకుండా జాగ్రత్తపడింది. చివరకు తన వైరస్ నియంత్రణ తన చేతిలో లేదని అర్ధమైన తర్వాతే బహిరంగంగా ప్రకటించింది. అప్పటికే ఇటలీ, స్పెయిన్ ఫ్రెన్స్, జర్మనీ లాంటి దేశాలకు వైరస్ పాకిపోయింది. అంటే యావత్ ప్రపంచం వైరస్ దెబ్బకు బలైపోతోందంటే అందుకు చైనానే కారణమంటూ అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి.

అదే సమయంలో చనైనాలో వైరస్ ఎంత ప్రభావం చూపిందనే విషయం తెలిసినా ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా లాంటి దేశాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. దాని ఫలితమే పై దేశాల్లో వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇటలీలోని చైనా వాళ్ళను వాటేసుకోవటం, ముద్దులుపెట్టిన విషయాన్ని వీడియోల రూపంలో అందరూ చూసిందే. వైరస్ విషయంలో జాగ్రత్తపడకుండా చైనా వాళ్ళని వాటేసుకుని ముద్దులు పెట్టమని ఎవరు చెప్పారు ఇటవీ వాళ్ళకు ? అదే సమయంలో వైరస్ ప్రభావాన్ని అంచనా వేయటంలో చాలా దేశాలు ఫెయిలయిన విషయం వాస్తవం. తాము చేసిన తప్పుకు కూడా ఇపుడు చాలా దేశాలు చైనానే నిందిస్తుండటమే విచిత్రంగా ఉంది.

ఇక ప్రపంచదేశాలు లాక్ డౌన్ అంటున్నా అమెరికాలో ట్రంప్ అవసరమే లేదు పొమన్నాడు. దాని ఫలితమే ఇపుడు అమెరికా జనాలు అనుభవిస్తున్నారు. అలాగే ఒకవైపు చైనాను నిందిస్తునే మళ్ళీ మెడికల్ ఎక్విప్మెంట్ కోసం అదే చైనాపై ఆధారపడుతున్నాయంటేనే ప్రపంచదేశాల ధీనస్ధితి అర్ధమైపోతోంది. ఇకనుండైనా ప్రతిచిన్న విషయానికి చైనాపై ఆధారపడటం మానుకోవాలన్న విషయం కూడా కరోనా వైరస్ తెలియజేసింది. చివరగా మెడికల్ ఎక్విప్మెంట్ కోసం ఇతర దేశాల నుండి ఆర్డర్లు తీసుకుని కూడా చైనా మొత్తాన్ని అమెరికాకు మాత్రమే పంపిస్తోందంటే అర్ధమేంటి ? తన ప్రయోజనాల గురించి మాత్రమే చైనా ఆలోచిస్తుందన్న విషయం కూడా కరోనా వైరస్ ప్రపంచానికి తెలియజేసింది.

Show comments