iDreamPost
android-app
ios-app

మేయర్‌ పోటీదార్ల ఓటమి.. తగ్గిన పోటీ

మేయర్‌ పోటీదార్ల ఓటమి.. తగ్గిన పోటీ

ఈ సారి గ్రేటర్‌ మేయర్‌ పదవి మహిళకు కేటాయించారు. దీంతో టీఆర్‌ఎస్‌ బడా నేతలందరూ తమ కుటుంబాలలోని మహిళలను ఎన్నికల బరిలో నిలిపారు. మేయర్‌ సీటును పొందడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ వాళ్లను ఎలాగైనా గెలిపించుకుని మేయర్‌ రేసులో నిలపాలని పోటీ పడ్డారు. ఇందుకోసం సీట్లు దక్కించుకోవడానికి అధినేతలను ప్రసన్నం చేసుకుని సఫలం చెందారు. అనంతరం డివిజన్లలో ప్రజలను ఆకట్టుకోవడానికి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మేయర్‌ ఆశావహుల్లో అత్యధిక అపజయం పాలయ్యారు. దీంతో మేయర్‌ పదవికి పోటీ తగ్గింది. ఇప్పటికే మేయర్‌ పదవి కోసం భారతీనగర్‌ డివిజన్‌ నుంచి గెలిచిన సింధు ఆదర్శరెడ్డికి ప్రగతి భవన్‌ నుంచి పిలుపు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆశావహుల్లో అధిక మందికి..

ఈసారి మేయర్‌ పదవి కోసం టీఆర్‌ఎస్‌ ప్రముఖ నేతల తమ కూతుళ్లు, బంధువులు, భార్యలను రంగంలోకి దింపారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య బొంతు శ్రీదేవి, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భార్య స్వప్నారెడ్డి, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మరదలు ముఠా పద్మ, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బంధువు సునరితా రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బంధువు రోజా తదితరులు పోటీలో దిగారు. వీరిలో చాలా మంది మేయర్‌ పీఠం కోసం రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో మేయర్‌ పీఠానికి తీవ్ర పోటీ ఉంటుందని అందరూ భావించారు. అనూహ్యంగా వీరిలో చాలా మంది ఓటమి పాలయ్యారు.

ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మరదలు ముఠా పద్మ, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బంధువు సునరితా రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భార్య స్వప్నారెడ్డి ఓటమి చెందిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఫలితాల అనంతరం అనూహ్యంగా భారతీనగర్‌ డివిజన్‌ నుంచి గెలిచిన సింధు ఆదర్శరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మేయర్‌గా ఆమె పేరు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కూ మేయర్ పదవి ఆశావ‌హుల పేర్ల‌లో ప్ర‌ధానంగా బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన టీఆర్‌ఎస్ కీలక నేత, ఎంపీ కే కేశవ రావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. కొత్త‌గా సింధు పేరు తెర‌పైకి రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరు ముగ్గురూ రెండో సారి కార్పొరేట‌ర్ గా విజ‌యం సాధించ‌డం విశేషం.

వీరే కాకుండా మ‌రోవైపు ఉద్య‌మ‌కారుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన‌ మ‌న్నె గోవ‌ర్థ‌న్ రెడ్డి భార్య‌, వెంక‌టేశ్వ‌ర కాల‌నీ డివిజ‌న్ నుంచి రెండో సారి భారీ మెజార్టీ (7060)తో గెలిచిన మ‌న్నె క‌వితా రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం మేయ‌ర్ పేరును ఖ‌రారు చేయాల్సి ఉంది.