ఒక వైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు: మరోవైపు ప్రతిపక్ష జలదీక్షలు

తెలంగాణలో ఒకవైపు అధికార పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తుంటే…మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ జల దీక్షలతో ఆందోళనలు చేస్తుంది. తెలంగాణలో ఒకపక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటే…మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు పరిణామాలు తెలంగాణలో సర్వత్రా చర్చ జరుగుతుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ తదితరులు అమర వీరులకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

గన్‌ పార్క్‌ వద్ద కార్యక్రమం ముగిసిన తర్వాత సిఎం కెసిఆర్‌ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ట్ర ఆవిర్భావ, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్యం తర్వాత అంత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుందని ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళ్ సై అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్న ముఖ్యమంత్రి కెసిఆర్, వారి త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని చెప్పారు.

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ వద్ద, గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసనమండలి వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనేక దశాబ్దాల పోరాట ఫలితంగా తెలంగాణను సాధించుకున్నామని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాజెక్టుల పూర్తిపై కాంగ్రెస్ ఆరోపణలు

కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ… ప్రాజెక్టుల వద్ద దీక్షలకు పిలుపునిచ్చింది. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనికి నిరసనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు దీక్షలు చేపట్టింది. దీక్షలకు పోలీసుల అనుమతి లేకపోవడంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుల వద్దకు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల వద్ద జలదీక్షకు వెళ్తున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నేతలు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జలదీక్షకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. దీంతో కొడంగల్‌లో ఉద్రిక్తత నెలకొనడంతో రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో పిసిసి నేత హర్షవర్ధన్‌ రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్‌లో వంశీచందర్‌ రెడ్డి, సంప్‌త్‌ కుమార్‌, మిర్యాలగూడలో డిసిసి అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ను గృహ నిర్బంధం చేశారు.

ఇలా ఒకవైపు రాష్ట్ర దినోత్సవ వేడుకలు..మరోవైపు ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని అధికార టిఆర్ఎస్ విమర్శిస్తుంటే, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.

Show comments