Idream media
Idream media
SK యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్, నా గురువు పీఎల్ శ్రీనివాసరెడ్డి అనారోగ్యంతో మరణించారు. 1985లో నేను MA తెలుగులో చేరాను. ఎందుకు చేరానో నాకూ తెలియదు. లెక్చరర్ కావాలనే కోరిక ఎప్పుడూ లేదు. హాస్టల్, లైబ్రరీ వుంటాయనే ఆశ. సాహిత్యమంటే ఇష్టం. తెలుగులో తప్ప ఇంకెక్కడా నాకు సీటు రాదు కూడా! అందుకే తెలుగుకి మాత్రమే ఎంట్రెన్స్ రాసాను. ఫస్ట్ ర్యాంక్ నాదే కాబట్టి సీటు వచ్చేసింది.
శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి దేవిక మేడం మాకు టీచర్లు. ఇద్దరూ నెమ్మదైన వారు. పాఠం కూడా నింపాదిగా అర్థమయ్యేలా చెప్పేవారు. ఇనాక్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, హెచ్ఎస్ బ్రహ్మానందలది జలపాత శైలి. అటుఇటు కదులుతూ వాగ్ధాటితో చెప్పేవాళ్లు. వీళ్లకి భిన్నంగా మెల్లిగా పారే సెలయేరులా శ్రీనివాసరెడ్డి.
ఎంత సున్నితమైన వ్యక్తి అంటే రెండేళ్లలో ఒక్క మాట కూడా కఠినంగా నోటి వెంట రాలేదు. సౌమ్యతకి చిరునామాలా వుండేవారు. ఒకసారి శ్రమైక జీవన సౌందర్యం అనే మాటని ఒక ప్రబంధం నుంచి శ్రీశ్రీ ప్రేరణగా తీసుకున్నాడని క్లాస్‌లో చెప్పారు. అప్పట్లో నేను శ్రీశ్రీ వీరభక్తున్ని. శ్రీశ్రీ కాపీ కొట్టాడని శ్రీనివాసరెడ్డి అంటున్నట్టు ఫీలయ్యాను. పీజీలో టీచర్లంటే చాలా భయముంటుంది. ఎందుకంటే వాళ్ల చేతిలో మార్కులుంటాయి. అయినా నేను లేచి ఇద్దరి మనుషులకి ఒకే రకమైన ఆలోచన రాకూడదా సార్ అని ప్రశ్నించాను. రావచ్చు అన్నారు. మరి శ్రీశ్రీ కాపీ అని ఎందుకన్నారు అని అడిగాను. కాపీ అనలేదు, ప్రేరణ అన్నాను అని సరి చేశారు.
తరువాత ఆయన రూమ్‌లోకి వెళితే చిరునవ్వుతోనే శ్రీశ్రీ కవిత్వం నాకూ ఇష్టమే. కానీ మాట్లాడడం వేరు. జీవితం వేరు. అర్థం కావాలంటే ఇంకా కొంచెం వయసు రావాలి . ప్రశ్నించే స్వభావాన్ని కాపాడుకోవడం అన్నిటికంటే కష్టమన్నారు. మాటకి, చేతలకి సంబంధం లేకుండా జీవించాల్సిన సందర్భాల్లోనూ, నోరు విప్పాల్సినపుడు మౌనంగా వున్న పరిస్థితుల్లోనూ శ్రీనివాసరెడ్డి మాటలు గుర్తొచ్చేవి.
క్లాస్ డే సందర్భంగా స్టూడెంట్స్ అందరమూ శ్రీనివాసరెడ్డి, దేవకి మేడంతో కలిసి రఘువీరా టాకీస్‌లో మ్యాట్నీ చూసాం. అప్పుడు వాళ్ల పాపకి ఏడాది వయసు. అందరం బాగా ముద్దు చేసినట్టు గుర్తు.
అన్నీ నిన్నమొన్న జరిగినట్టున్నాయి. ఇపుడు ఆయన మరణవార్త. దేవకీ మేడం గారికీ, పిల్లలకి మనో ధైర్యం కోరుకుంటూ సార్‌కి ఆత్మశాంతి కలగాలి.