రాయలసీమ సాహిత్యంలో రైతుకి, ఆ రైతు చేసే వ్యవసాయానికి ఒక ప్రత్యేక స్థానముంటుంది. ఇక్కడ తరచూ వచ్చే కరువు కాటకాలు, వ్యవసాయానికి ప్రతికూలమైన పరిస్థితుల వల్ల కావొచ్చు ఆ మట్టి వాసన తెలిసిన రాయలసీమ రచయితలు వ్యవసాయం నేపథ్యంలో కథలు రాయకుండా తమ రచనా వ్యాసంగాన్ని ముగించిన వారు లేరు ఉన్నా అరుదనే చెప్పొచ్చు.
అలా రైతు జీవితాన్నే తన కథా వస్తువుగా తీసుకుని ఆ సాహిత్యాన్ని స్వచ్చమైన రాయలసీమ యాసలో శిఖరాగ్రానికి తీసుకెళ్లిన అతి కొద్దిమందిలో ఆయనదొక ప్రత్యేక స్థానం.
ఆయన గురించి, ఆయన రచనల గురించి ఫలానా అని తెలియకముందే ఆయన కథలు చదివాను. చదవడం కాదు ఆ కథలతో నేనూ కొంతదూరం ప్రయాణించాను. ఆ ప్రయాణంలో ఎన్నోన్నో అనుభవాలు పలకరించాయి.
రాయలసీమ యాసలో ఇంగ మంచి రచనలు చేసిన రచయిత ఎవరబ్బా అని నేను గురు సమానులుగా భావించే సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి గారిని అడిగా. ఆయనతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఎవర్నైతే నేను గురు సమానులుగా భావిస్తానో ఆయనకు ఈయన గురువు అని.
ఆయనే అనంతపురం జిల్లా నుంచి కలం పట్టి తన రచనామృతాన్ని నలుదిక్కులా పంచిపెట్టిన రాయలసీమ సాహితీ శిఖరం సింగమనేని నారాయణ గారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఎన్నో ఏళ్లుగా నెర్రెలు చీలిన నేలను ఒక పదును వాన తడిపితే ఆ రైతు ఎంత సంతోషంగా హలం పట్టి సేద్యం చేస్తాడో అంతే వైనంగా కలం పట్టి సాహితీ సేద్యం చేశారు మన సింగమనేని గారు.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే “సింగమనేని సార్ చాలా అరుదైన వ్యక్తి. సాధారణంగా నూటికి దాదాపూ 99.99% రచయితల వ్యక్తిగత జీవితం వేరు వారు చేసే రచనలు వేరు అయి ఉంటాయి గానీ సింగమనేని గారి రచనా జీవితం వ్యక్తిగత జీవితం రెండూ ఒక్కటే. ఆయన రచనల్లో ఎలా ఉంటారో బయట వ్యక్తిగతంగా కూడా అలాగే జీవిస్తాడు. కోరికలు లేని జీవితం. కొత్త కొత్త రచయితల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ నాలుగడుగులు ముందే ఉంటాడు. ఆయన నాటిన సాహితీ విత్తనాలు ఇప్పుడు మంచి మంచి వృక్షాలైనాయి. అంతెందుకు నా మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. రచనలు మొదలుపెట్టిన తొలినాళ్లలో సాహిత్యం పట్ల నాకున్న భావాలు, అభిప్రాయాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయంటే అది ఆయన వల్లే” అంటాడు.
రాయలసీమ కు చెందిన మరో రచయిత పాలగిరి విశ్వప్రసాద్ గారి మాటల్లో చెప్పాలంటే “చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఇన్నాళ్లు గవర్నమెంట్ టీచర్ గా పనిచేసినా స్వంత ఇళ్లు కూడా కొనుక్కోని మనిషి. నెలా నెలా పెన్షన్ వస్తే తన దగ్గర స్వంతంగా రూపాయి కూడా ఉంచుకోడు. అంతటి విశాల దృక్పథం కలిగిన వ్యక్తి సింగమనేని గారు” అంటూ చాలానే చెప్పుకొస్తారు.
ఈ మధ్యనే కడప జిల్లాలో ‘ఏరువాక సాహితీ సంస్థ, బద్వేల్’ ఆధ్వర్యంలో ‘సింగమనేని సాహితీ పురష్కారం’ పేరుతో ఉత్తమ కథా సంపుటులను ఎన్నుకుని ఔత్సాహిక రచయితలను ప్రోత్సహిస్తున్నారంటే అది సింగమనేని గారికి లభించిన గొప్ప గౌరవం. లేకుంటే ఎక్కడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు దగ్గర ఒక పల్లె ఎక్కడ కడప జిల్లాలోని బద్వేల్ అనే ఊరు. అదంతా ఆయన రచనామృతంలోని సారమే కదా అనిపించకమానదు.
అటువంటి అరుదైన మనిషి, కథా రచయిత, సాహితీ విమర్శకులు అయిన సింగమనేని గారు ఈనాడు మన మధ్య లేకపోవడమనేది తెలుగు సాహితీ లోకానికి ఒక తీరని లోటు.
నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలుపెట్టినప్పటి నుండి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు రెండు మూడుసార్లు సింగమనేని సార్ దగ్గరికి తీసికెళ్తా అన్నాడు గానీ చివరి నిముషంలో కుదర్లేదు. సింగమనేని పురస్కారం ప్రథానానికి వస్తే కలిసే అవకాశం ఉంటుందనుకున్నా కరోనా వల్ల అదీ కుదర్లేదు. అంతలోపే ఇలా కలం చేశారు. ఆ వెలితి ఎప్పటికీ ఉంటుందేమో నాలో.