iDreamPost
iDreamPost
దాదాపుగా 9 నెలల తర్వాత పర్యటకం మళ్లీ పట్టాలెక్కింది. ప్రకృతి ప్రేమికులు మళ్లీ సేద తీరుతున్నారు. సహజంగా సెప్టెంబర్ నుంచి కళకళలాడే పర్యటక క్షేత్రాలు ఈసారి కాస్త ఆలశ్యంగా డిసెంబర్ లో జనసందడితో కనిపిస్తున్నాయి. రాబోయే రెండు నెలల పాటు మరింత జనసమ్మర్థం ఖాయమని అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో సుదీర్ఘకాలం పాటు ఇంటికే పరిమితమయిన టూరిస్టులు ఒకేసారి పర్యటక క్షేత్రాల వైపు సాగుతున్నారు. చివరకు లంబసింగి వంటి ప్రాంతాల్లో మూడ, నాలుగు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడిందంటే జనం ఎంత ఆతృతలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం ప్రారంభం నుంచి కరోనా విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించింది. అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆదర్శనీయంగా వ్యవహరించింది. కేసుల సంఖ్య పెరుగుతుందనే ఆలోచనను విరమించుకుని, ఎక్కువగా పరీక్షలు చేయడమే లక్ష్యంగా సాగింది. చివరకు రాష్ట్రంలో సుమారు 1.20 కోట్ల మందికి పరీక్షలు చేసి సగటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆగష్ట్, సెప్టెంబర్ మాసాల్లో రోజుకి 10వేలు దాటి కేసులు నమోదయినా కలత చెందకుండా పగడ్బందీగా వ్యూహాన్ని అమలు చేసింది. ఫలితంగా డిసెంబర్ మధ్యకు వచ్చే సరికి ప్రస్తుతం రోజూ 60వేల మందికి పరీక్షలు చేస్తుంటే కేవలం 5,6 వందల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. తద్వారా కరోనా విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందని లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో మరోసారి మహమ్మారి విరుచుకుపడకుండా జాగ్రత్తలు పడుతోంది.
టూరిస్ట్ కేంద్రాల విషయంలో కూడా ప్రభుత్వం వ్యూహౄత్మకంగా వ్యవహరించి విజయవంతమయ్యింది. ఆహ్లాదం కోసం పర్యటక ప్రాంతాలకు వచ్చే వారికి ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు ప్రయత్నించింది. ఫలితంగా పర్యటకులకు ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటుంది. తత్ఫలితంగా ప్రస్తుతం విశాక ఆర్కే బీచ్ నుంచి బొర్రా గుహలు, లంబసింగి వరకూ అన్ని చోట్లా ప్రకృతి ఒడిలో చేరేందుకు పలువురు పోటెత్తుతున్నారు. విజయవాడ భవానీ ద్వీపం, మారేడుమిల్లి అటవీ ప్రాంతం, కోటప్ప కొండ, హర్సిలీ హిల్స్ , శ్రీశైలంలో కూడా ఈ ఆదివారం కిక్కిరిసిపోయి కనిపించింది. ఇక ఆధ్యాత్మికంగానూ అందరికీ కొండపైకి అవకాశం కల్పించడంతో యాత్రికుల సంఖ్య 40వేలు దాటింది. మార్చి 18 తర్వాత ఆ సంఖ్యలో కొండకు ఈ స్థాయిలో భక్తులు రావడం విశేషంగానే చెప్పాలి.
టూరిజం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలువురు తరలివస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా టూరిస్టులు అత్యధికంగా విశాఖ ప్రాంతంలో దర్శనమిస్తున్నారు. ఇక తమిళనాడు, కర్ణాటక వాసులతో ఏడుకొండలు రద్దీగా మారుతున్నాయి. ఉత్తరాది నుంచి కూడా పర్యటకుల సంఖ్య పెరుగుతుండడంతో ఏపీ టూరిజం ఆధ్వర్యంలోని అన్ని రిసార్టులు, హోటళ్లు మళ్లీ అడ్వాన్సు బుకింగ్ దశకు చేరుకుంటున్నాయి.