iDreamPost
iDreamPost
కరోనా వచ్చి థియేటర్లు మూతబడినప్పుడు ఓటిటిలు నిర్మాతల పాలిట ఆపద్భాందవులుగా మారిన సంగతి గుర్తే. పాండమిక్ టైంలో ఎన్నో డిజాస్టర్లు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు వెళ్లి నష్టాలకు బదులు మంచి లాభాలతో గట్టెక్కాయి. ఒకవేళ నాని వి, టక్ జగదీష్, అనుష్క నిశ్శబ్దం లాంటివి థియేటర్లలో వచ్చి ఉంటే ఖచ్చితంగా బయ్యర్లకు పెద్ద దెబ్బ పడేది. అందుకే సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత సైతం తమ్ముడు వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2లను ఫ్యాన్సీ రేట్ కి ప్రైమ్ కి అమ్మేసి టెన్షన్లను తప్పించుకున్నారు. వెంకీ లాంటి స్టార్ హీరోకు ఇలా చేయడం పట్ల అభిమానులు కొంత ఆగ్రహం ప్రదర్శించినా పక్కా బిజినెస్ మెన్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఇదంతా గతం. అప్పుడంటే ముందు వెనుకా చూసుకోకుండా సినిమాల బడ్జెట్ లను మించి కోట్లను కుమ్మరించి హక్కులు కొన్నాయి ఓటిటిలు. ఇప్పుడు స్వరం మార్చేశాయి. రకరకాల కండీషన్లతో చుక్కలు చూపించడం మొదలుపెట్టాయి. ఉదాహరణకు ఆ మధ్య ఓ అప్ కమింగ్ సక్సెస్ ఫుల్ హీరో సినిమాను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం ఓ సంస్థ అడిగింది. కంటెంట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్మాత నో అన్నారు. తీరా చూస్తే ఆ బొమ్మ మొదటి రోజు సెకండ్ షోకే చేతులెత్తేసింది. ఆరు కోట్లకు అమ్మితే కోటి రాలేదు. తీరా డిజిటల్ డీల్ మాట్లాడుకునే టైంలో పే పర్ వ్యూ పద్ధతిలో అయితేనే షేర్ చేసుకుందామని చెప్పడంతో విధి లేని పరిస్థితిలో ఒప్పేసుకున్నారు.
కట్ చేస్తే ముందు వచ్చే మొత్తంలో సగం కూడా వచ్చే అవకాశం లేనట్టే. మరోవైపు ఓటిటి ప్రీమియర్ల కోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ వ్యయం చేయడం ఇష్టం లేని ఓటిటి;లు ముందు థియేటర్ రిలీజ్ చేసి ప్రమోషన్లు గట్రా చూపించి అప్పుడు కొంటామని తెగేసి చెబుతున్నాయి. దీనివల్లే శాకినీ డాకిని, దొంగలున్నారు జాగ్రత్తలు ఇష్టం లేకపోయినా బిగ్ స్క్రీన్ వైపు వెళ్లాయి. తీరా చూస్తే మూడో వారం రాకుండానే ఆ రెండు స్మార్ట్ స్క్రీన్ పై వచ్చేశాయి. ఇప్పుడు ఓటిటిలకు ఓవర్ కంటెంట్ వస్తోంది. అందుకే వాళ్ళు పెట్టే నిబంధనలకు ఎస్ అనడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇదిలాగే కొనసాగడం ఖాయం. ఎవరో ఒకరు కొంటారులేనే అనే ధీమా ఇప్పుడు పనికిరాదు. జాగ్రత్త తప్పదు సుమా