November 26th Releases : నవంబర్ 26 సినిమాల జాతర

మరో శుక్రవారం వచ్చేస్తోంది. మొన్నొచ్చిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కనీస స్థాయిలో లేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. అంతో ఇంతో పబ్లిసిటీ చేసుకున్న ఊరికి ఉత్తరాన, మిస్సింగ్, రామ్ అసురలు కూడా నిరాశపరిచే విధంగానే నడుస్తున్నాయి. అందుకే ఇప్పుడు 25, 26 తేదీలపైన మూవీ లవర్స్ దృష్టి మళ్లుతోంది. ముందుగా వస్తున్నది ‘లూప్’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ్ లో ‘మానాడు’ పేరుతో రూపొందిన ఈ టెర్రరిస్ట్ థ్రిల్లర్ మీద ఇక్కడ మినిమమ్ బజ్ కూడా లేదు. అందుకే శింబునే స్వయంగా హైదరాబాద్ వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రమోషన్లు చేస్తున్నాడు కానీ ఇవి ఎంతవరకు ఫలితమిస్తాయో సందేహమే.

26న రాబోతున్న రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ సైతం ఏమంత హైప్ ని క్యారీ చేయడం లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం కాబట్టి ఏదో హడావిడి చేస్తున్నారు కానీ అది ఓపెనింగ్స్ ఉపయోగపడేది లేనిది చెప్పలేం. టీమ్ ని బిగ్ బాస్ హౌస్ కి తీసుకొచ్చి మరీ సినిమాని ఆడియన్స్ కి పరిచయం చేయడం గట్రా పెట్టుకున్నారు. టాక్ బ్రహ్మాండంగా వస్తే తప్ప ఏదీ ఆశించలేం. ఇక సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ మీద ఓ వర్గం ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. స్పూఫ్ కామెడీతో కాస్త అతి చేసినట్టు అనిపించినా కొబ్బరిమట్ట లాగా ఇది కూడా ఏదైనా అద్భుతం చేయకపోదా అనే అంచనాలో ఉన్నారు నిర్మాతలు. వెంకటేష్ ఈ సినిమాకు ట్వీట్ చేయడం విశేషం

ఇవి కాకుండా 1997, భగత్ సింగ్ నగర్, కార్పొరేటర్ అనే మరో మూడు సినిమాలు 26నే వస్తున్నాయి. చిన్న చిన్న ఈవెంట్లు గట్రా చేస్తున్నారు కానీ టాక్ మీద ఆధారపడటం తప్ప వేరే ఆప్షన్ లేదు. 25న జాన్ అబ్రహం బాలీవుడ్ మూవీ ‘సత్యమేవ జయతే 2’ వస్తోంది. సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యామియో చేసిన ‘అంతిమ్’ కూడా 26నే దిగుతోంది. మరో రెండు హాలీవుడ్ చిత్రాలు వస్తున్నాయి. మొత్తానికి కౌంట్ ఘనంగా ఉంది కానీ ఏ ఒక్కటి హౌస్ ఫుల్ చేయదన్నది నిజం. నగరాల్లో ఒకటి రెండు మల్టీ ప్లెక్సుల్లో కొంత సందడి ఉండొచ్చు మిగిలినవి చూడాలి. 2న అఖండ వచ్చే దాకా ఈ నిర్లిప్తత తప్పేలా లేదు. ట్రేడ్ కూడా ప్రిపేట్ అయ్యే ఉంది

Also Read : Venky Kudumula : వెంకీ కుడుముల – ఇంత ఆలస్యమేలా

Show comments