iDreamPost
android-app
ios-app

Tollywood New Directors : ప్రతిభను చాటుకున్న యంగ్ టాలెంట్స్

  • Published Dec 28, 2021 | 10:24 AM Updated Updated Dec 28, 2021 | 10:24 AM
Tollywood New Directors : ప్రతిభను చాటుకున్న యంగ్ టాలెంట్స్

ఇంకో మూడు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రతిసారి ఎన్నో ఆశలతో లక్ష్యాలతో కోటి సంబరాలతో అందరి జీవితాల్లో వెలుగులు రావాలనే సంకల్పంతో మొదలయ్యే నూతన ఏడాదికి వెళ్ళబోతున్న సందర్భంగా ఒక్కసారి 2021 జ్ఞాపకాలను రివ్యూ రివైండ్ రూపంలో నెమరేసుకుందాం. కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మరో మూడు నాలుగు నెలలు మూతబడినప్పటికీ అందరికంటే ముందుగా కోలుకున్నది మాత్రం ముమ్మాటికీ టాలీవుడ్డే. ఈసారి యువరక్తం డెబ్యూ డైరెక్టర్ల రూపంలో సంచలనాలు సృష్టించింది.

1. ఉప్పెన – బుచ్చిబాబు

సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఓ కొత్త జంటను తెరకు పరిచయం చేస్తూ 100 కోట్ల సినిమాను ఇస్తాడని ఎవరైనా ఊహించారా. కానీ అతను నిజం చేసి చూపించాడు. సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ఆసి బేబమ్మల ప్రేమకథకు దేవిశ్రీప్రసాద్ మధురమైన స్వరాలు తోడవ్వడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయి కాసుల వర్షం కురిపించారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఉప్పెన ఫలితం పూర్తిగా బుచ్చిబాబు ప్రతిభే అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.

2. ఎస్ఆర్ కళ్యాణమండపం – శ్రీధర్ గాదె

చేసిన ఒక్క సినిమాతో యావరేజ్ ఫలితం అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మాణంలో ఉన్నప్పుడు పెద్దగా చర్చలో లేదు. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక థియేటర్లు తెరిచినప్పుడు సూపర్ కలెక్షన్స్ రాబట్టుకున్న ఈ సినిమాలోని నేటివిటీ, దర్శకుడు శ్రీధర్ గాదె సహజంగా చూపించిన లవ్ స్టోరీ, చేతన్ భరద్వాజ్ పాటలు వెరసి కేవలం మూడు కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ ఎంటర్ టైనర్ ఏకంగా 10 కోట్ల దగ్గరకు వెళ్లడం నిజంగా సెన్సేషనే

3. నాంది – విజయ్ కనకమేడల

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక మహర్షి తో సపోర్టింగ్ రోల్స్ కి వచ్చిన అల్లరి నరేష్ లోని అసలైన నటుడిని పరిచయం చేసిన నాంది ద్వారా దర్శకుడు విజయ్ కనకమేడల ఒక సీరియస్ ఇష్యూ ని ప్రెజెంట్ చేసిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. కమర్షియల్ టచ్ ఇచ్చినప్పటికీ ఆర్టిస్టుల నుంచి రాబట్టుకున్న పెర్ఫార్మన్స్, కథను చెప్పిన విధానం నిర్మాతకు లాభాలను, హక్కుల రూపంలో మంచి రాబడిని ఇచ్చింది. దీని దెబ్బకు స్టార్స్ నుంచి కూడా విజయ్ కు కాల్స్ వెళ్లడం అబద్దం కాదు

4. రాజరాజ చోర – హసిత్ గోలి

సింపుల్ పాయింట్ తో టిపికల్ స్క్రీన్ ప్లే తో రాజరాజ చోర ను డీల్ చేసిన తీరు దర్శకుడు హసిత్ గోలికి డెబ్యూతోనే మంచి మార్కులు తెచ్చి పెట్టింది. కంటెంట్ మీద నమ్మకంతో థియేటర్ల కోసం ఎదురు చూసిన నిర్మాతలు దానికి తగ్గట్టే మంచి బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకున్నారు. శ్రీవిష్ణు కెరీర్లో మరో హిట్టు చేరింది. దొంగతనాలు మోసాలు చేసే ఒక యువకుడి జీవితాన్ని చూపించిన వైనం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేసింది. ఫలితంగా రాజరాజ చోర ఈ ఏడాది టాప్ 10లో చోటు దక్కించుకుంది

5. ఇంకా ఉన్నారు

శ్రీకారంతో పరిచయమైన ‘కిషోర్’ వసూళ్ల లెక్కలో విజయం సాధించలేదు కానీ మంచి ప్రయత్నమనే పేరు తెచ్చుకున్నారు. వరుడు కావలెనుతో డెబ్యూ చేసిన ‘లక్ష్మి సౌజన్య’ క్లీన్ ఎంటర్ టైనర్ ఇచ్చారు. 30 రోజుల్లో ప్రేమించడంతో ప్రదీప్ ని హీరోగా లాంచ్ చేయడంతో ‘మున్నా’ సక్సెస్ అయ్యారు. శ్రీకాంత్ అబ్బాయి రోషన్ ని పెళ్లిసందడితో పరిచయం చేసిన ‘గౌరీ రోనంకి’ బిసి సెంటర్ల వసూళ్లతో ఆశ్చర్యపరిచారు. ‘అనిల్ పాదూరి’ రొమాంటిక్ ఓ వర్గం యూత్ ని బాగానే ఆకట్టుకుంది. రాజా విక్రమార్క ద్వారా ‘శ్రీసారిపల్లి’. చావు కబురు చల్లగాతో ‘కౌశిక్ పెగల్లపాటి’ ఇద్దరూ నిరాశపరిచారు. రెండూ కార్తికేయ సినిమాలు కావడం గమనార్హం. టీవీ నటుడు సాగర్ ని హీరోగా తీసిన షాదీ ముబారక్ తో డైరెక్టర్ ‘పద్మశ్రీ’లో టెక్నీషియన్ గుర్తింపబడ్డాడు.

ఇలా పదుల సంఖ్యలో టాలీవుడ్ లో తమ టాలెంట్ ని పరీక్షించుకున్న యువ దర్శకులు 2022లో మరిన్ని అవకాశాలు అందుకుని ఆకాశమే హద్దుగా తమ ప్రతిభను చాటుకుంటారని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మనం కోరుకునేది కూడా అదే

Also Read : Rajesh Khanna : తెరపై రాబోతున్న అమ్మాయిల ఆరాధ్య హీరో కథ