Idream media
Idream media
హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనందున సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిట్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లను శిక్షించాలని ఈడీ కోరింది. ఈ పిటిషన్‌పై గురువారం చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరపున న్యాయవాది గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో విచారణను ముగిస్తూ… చార్జిషీట్లు, కాల్‌డేటా, డిజిటల్ రికార్డులు సహా మొత్తం వివరాలను ఈడీకి అందజేయాలని హైకోర్టు పేర్కొన్నదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నెల రోజుల్లో వీటిని అందించాలని ఫిబ్రవరి 2న హైకోర్టు ఆదేశించినా… ఇంతవరకు ఇవ్వలేదన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సీఎస్ సోమేశ్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌లకు నోటీసులు జారీచేసింది. పది రోజుల్లో కౌంటర్లు దాఖలుచేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదావేసింది. కాగా… తమ వద్ద ఉన్న మొత్తం వివరాలను ఇచ్చేశామని పేర్కొంటూ ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఓ మెమో దాఖలుచేసింది. మరోవైపు ఈడీ మాత్రం తమకు ఏ వివరాలూ అందలేదని స్పష్టం చేస్తోంది.
క్యాడర్ విభజనపై హైకోర్టులో వాదన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కావాలనే 2014 జూన్ 1న వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారని సీఎస్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. అప్పటికే రిటైర్ అయి నాలుగు నెలలపాటు సర్వీసు పొడిగింపులో ఉన్న మహంతి… మధ్యలో వీఆర్‌ఎస్ తీసుకోవడం హాస్యాస్పదమని కోర్టుకు తెలిపారు. ఇరు రాష్ర్టాల మధ్య అధికారుల విభజనలో ఏపీకి కేటాయించినా… క్యాట్ ఆదేశాల అండతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్‌కుమార్‌ను తిరిగి ఏపీకి పంపాలని కోరుతూ కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. సోమేశ్‌కుమార్ తరపున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ… రాష్ట్రాల మధ్య విభజించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌ల జాబితాలో పేరు లేకుండా చేసుకునేందుకే పీకే మహంతి వీఆర్‌ఎస్ తీసుకున్నారన్నారు. మహంతి పేరు జాబితాలో లేకపోవడం వల్లే తనను ఏపీకి కేటాయించారన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 19కి వాయిదావేసింది.