నిత్యం ఏదో ఒక్క ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులు కూడా ప్రమాదానికి గురవుతుంటాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తోన్న స్కూల్ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వికారాబాద్ జిల్లా పరిగిలో చెరువులోకి న్యూ బ్రిలియంట్ అనే ఓ ప్రైవేటు స్కూల్ బస్సు దూసుకెళ్లింది. శనివారం ఉదయం విద్యార్థులను తీసుకెళ్తోన్న స్కూల్ బస్ అదుపుతప్పి.. చెరువులోకి దూసుకెళ్లింది. పరిగి ప్రాంతంలోని సుల్తాన్ పూర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి ఈ బస్ ఒరిగింది. ఈ అకస్మాత్తు పరిణామంతో బస్ లోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు బస్సులో నుంచి బయటకు దిగడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ స్కూల్ పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. ఈ బస్సులో ఉన్న చిన్న పిల్లలు ఈ ప్రమాదంతో భయపడిపోయి.. పెద్ద పెట్టున ఏడుస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సు పూర్తిగా నీటిలోకి పోయి ఉంటే.. పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ల పని తీరును స్కూల్ యాజమన్యం గమనిస్తూ ఉండాలని, అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి.. ఇలా స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.