iDreamPost
iDreamPost
పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు .
ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 2014 డిసెంబర్ 31 న విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణ కార్యకలాపాలు మొదలయ్యాయి .
చంద్రబాబు చూపించిన ఊహాలోకం మాయలో కొందరు రైతులు భూములిచ్చారు . కొందరు ఒప్పించబడ్డారు , కొందరు బెదిరింపబడ్డారు , కొందరు దండనతో దారికొచ్చి ఇచ్చారు .
సామ ,దాన , భేద , దండోపాయాలతో పాటు ఆర్ధిక సామాజిక వర్గ ప్రలోభాలు కూడా ఇందుకు దోహదం చేశాయని ఘంటాపథంగా చెప్పొచ్చు . స్వయంగా మంత్రి నారాయణ అక్కడే మకాం వేసి కొందరికి నచ్చచెప్పి , కొందర్ని గ్రామంలో తమ నాయకుల చేత ఒప్పించి , ఈ రోజు రాజధాని ఇక్కడే కట్టాల్సిందే అని చిలక పలుకులు పలుకుతున్న బోయపాటి సుధా రాణి లాంటి వాళ్ళు ఆ రోజు భూమివ్వమని అడ్డం తిరిగితే రెండు రోజులు మాయ చేసి భయపెట్టి రాజధాని అవసరం తెలుసుకొనేట్టు చేసి భూసమీకరణ చేశారు అన్నది నేటికి గతం .
నాటి నుండి నేటికి రైతుకి ఏమి ఒరగబెట్టారు అంటే ఆకాశంలో మబ్బులు చూపించి చేతిలో బుంగ ఊడబీక్కుని తాగి పగలేశారు , అరచేతిలో వైకుంఠం చూపించి నేల మీద నిలువ నీడ లేకుండా చేశారు అని చెప్పొచ్చు .
రెండేళ్లలో అభివృద్ధి చేసి ఇస్తామన్న ప్లాట్లు ఈ రోజుకీ ఎక్కడున్నాయో అతీగతీ లేదు .
కాగితాల మీద జరిగిన రిజిస్ట్రేషన్లలో ఉన్న ప్లాట్ చిరునామా రైతుకే కాదు , రిజిస్ట్రేషన్ చేసిన గత ప్రభుత్వానికీ తెలీదు .
ఐదేళ్లలో సింగపూర్ నిర్మిస్తా అన్న మాటలు నీటి మూటలైనా కాక గాలి మాటలుగానే మిగిలి పోయాయి .
సాంకేతికంగా భూమి రాజధానికిచ్చినా ఏమీ కట్టలేదు కదా , ఖాళీగా ఉండటం ఎందుకని బ్రిటిష్ వారికన్నా క్రూరంగా సాగు చేసిన వారి పంటలు దున్ని ఎం బావుకొన్నారో .
ఐదేళ్ల తర్వాత ఎక్కడి గొంగళి అక్కడే , కట్టిన ఒకటీ ఆరా తాత్కాలిక భవనాలు చిల్లుల గొంగల్లు అయ్యాయి . చినుకు పడితే చిత్తడి అయ్యే కోర్టు , ఇతర ప్రాంగణాలు చూస్తేనే చికాకు పుట్టేట్టు ఉన్నాయి .
ఐదేళ్లు ముగిశాయి , ప్రభుత్వం మారింది . రాజధాని పరిస్థితి చూస్తే కట్టింది గోరంత , కట్టాల్సింది కొండంత , చేయాల్సింది అనకొండ అంత , కావాల్సిన నిధులు హిమాలయమంత అన్నట్టు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్ధిక స్థితిని , ఇతర ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజధాని వికేంద్రీకరణ అన్న ఆలోచన ప్రస్తుత ప్రభుత్వం బయట పెట్టింది . దానితో పాటు రాజధాని భూసేకరణ అంశంలో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగింది అని అధికార టీడీపీ పెద్దలు వారి అనుయాయులు నాలుగు వేల ఎకరాల పై చిలుకు అక్రమంగా కొని లబ్ది పొందారని ప్రకటించింది .
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ ప్రాంత ప్రజలు తామిచ్చిన భూమి పరిస్థితి ఏంటి అని ఆందోళన పడ్డారు అది సహజం కూడా . వీరితో పాటు తాము కొన్న , బినామీల పేరిట కొన్న భూముల పరిస్థితి ఏంటీ , అత్యంత అధిక ధరలతో లబ్ది పొందుదామన్న ఆలోచనకు ఎసరు వస్తుందనే భయాందోళనలు గత ప్రభుత్వంలోని అక్రమ కొనుగోలు దార్లలో మొదలయ్యాయి .
వాటి ఫలితమే ఈ బినామీలతో నడిపిస్తున్న నిరాఘాట ఆందోళనలు . నిజమైన రైతుల్లో కలిసిపోయి వారిలో ఆందోళన రేకెత్తిస్తూ వారిని ప్రభుత్వం పై ఉసిగొల్పుతూ దారుణ వ్యాఖ్యలలు , సభ్య సమాజం వినలేని బూతులు తిట్టిస్తూ , చివరికి వారి ఆందోళనలు ప్రసారం చేసే మీడియా వారిపై కూడా దాడులు చేసే దిశగా ప్రోత్సహిస్తున్నారు .
గత ఐదేళ్లలో నాలుగేళ్లు టీడీపీ పాడిన ప్రతి పాటకు వంత పాడి వియ్యం చెడాక రాజధాని రైతుల్ని మోసం చేసారని అంటూ “ఎవరి రాజధాని అమరావతి” పుస్తకం ఆవిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్ పై ఈ రోజు ఆరోపణలు నడుస్తున్నాయి తనకి ఐదు వందల ఎకరాల భూమి లబ్ది చేకూరింది అని . ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ ని బట్టి టీడీపీకి సన్నిహితంగా ఉన్న పవన్ కళ్యాణ్ కె ఆ అవకాశం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తుంది .
2015 లో పర్యటించినప్పుడు వారి భూములు ప్రభుత్వం లాక్కుంటే తాను అండగా పోరాడతానన్న పవన్ ఈ రోజు తనపై వచ్చిన ఐదు వందల ఎకరాల దోపిడీ ఆరోపణలపై ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్తాడో . పుస్తకావిష్కరణలో పేర్కొన్నట్టు టీడీపీ మోసం చేసినప్పుడు ఎందుకు నిలదీయలేదు . ఇన్నాళ్లు మాకెందుకు అండగా నిలవలేదు . ఐదొందల ఎకరాల ప్రస్తావన రాగానే ఎందుకు పరిగెత్తుకొచ్చావు , పది కోట్ల విలువైన భూమి నీ ఇంటికి ఎందుకు ఇరవై లక్షలకే ఇచ్చారు లాంటి ప్రశ్నలు వరసగా సంధిస్తే సమాధానం చెప్పగలడా .
ఇహ నారా భువనేశ్వరి గారు , వీరి భర్త భూములు లాక్కుని నన్ను చూసి రాజధాని కడతానని నమ్మకంతో భూములు ఇచ్చారు అని చెప్పిన మీ ఆయన ఐదేళ్లు ఏమి కట్టాడు , నమ్మకం ఎక్కడ నిలుపుకొన్నాడు , ఈ రోజు ఎం మొహం పెట్టుకొని వచ్చావు , మీ ఆయన బినామీలు దోచుకొన్న 4075 ఎకరాల మాటేంటి , ఈ రోజు మా ఈ దుర్గతికి మీ ఆయనే కారణం కాదా అంటే ఎం సమాధానం చెప్తుందో .
లేక అదిగో అల్లదిగో మా వారు నిర్మించిన మాహిస్మతీ నగరమూ ,
అది తాత్కాలిక కొలను కోర్టు ,
అదియే సకల కాలములందు వర్షించు అసెంబ్లీ ,
అదిగో సౌచ్యాలయములు సరిలేని సచివాలయమూ,
అని పాట రూపంలో చెప్తుందా , లేక వారి కోడలు మంగళగిరి ఎన్నికల్లో కనిపెట్టిన చేనేత పదార్ధాలకు తోడు తానూ ఏదైనా కొత్తగా కనిపెట్టి వారి కష్టాలు తీరుస్తుందా వేచి చూడాల్సిందే .