iDreamPost
android-app
ios-app

వెంటపడిన కుక్కలు.. ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి!

వెంటపడిన కుక్కలు.. ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి!

ఈ మధ్యకాలంలో కుక్కల దాడుల ఘటనలు బాగా పెరిగి పోతున్నాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో నాలుగేళ్ల బాలుడిపై  కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు  మృతి చెందాడు. ఆ తరువాత ఇలాంటి ఘటనలు అనేకం జరిగి.. పలువురు మృతి చెందగా.. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఈ కుక్కల దాడుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరో రూపంలో మృతి చెందుతున్నారు. ఇటీవలే ఓ స్విగ్గి బాయ్ కుక్క దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బిల్డింగ్ పై నుంచి దూకి మృతి చెందాడు. తాజాగా   విద్యార్థికి కూడా కుక్కలు వెంటబడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు.ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంకు చెందిన ఇనుగాల జయపాల్,స్వప్న దంపతులు. వీరికి ధనుష్(10)అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అతడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పాల్గొనేందుకు ధనుష్  ఇంటి నుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వీధి కుక్కలు ధనుష్ వెంట పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగెడుతుండగా ట్రాక్టర్ ఢీ కొట్టింది. అదే గ్రామానికి చెందిన రిక్కల నారాయణరెడ్డికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్.. అతివేగంగా, నిర్లక్ష్యంగా  ట్రాక్టర్ నడుపుతూ బాలుడిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ధనుష్ ట్రాక్టర్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ధనుష్ ను కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం  మధ్యలో మృతి చెందాడు.

ప్రభుత్వ అధికారులు చేపట్టిన ర్యాలీనే తమ బిడ్డను బలి తీసుకుందని, అది జరగకుండా ఉంటే తమ బిడ్డ బతికేవాడని బాలుడి తల్లిదండ్రులు  విలపించారు.  మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని, డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి కుటుంబాన్ని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వం బాలుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి బాలుడి మృతదేహాన్ని పరిశీలించాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు. కుక్కల దాడి, కొందరి నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందడం అందరిని బాధించింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.