తిరుపతిలో పవన్ ప్రచారం.. ఏం చెప్పి ఓట్లు అడుగుతారు?

తిరుపతి రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నికల ప్రచారాన్ని అటు వైసీపీ, ఇటు బీజేపీ-జనసేన హోరెత్తిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో ప్రచారం చేయనున్నారు. ముందుగా పాదయాత్ర చేసి.. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే పవన్ ఏం మాట్లాడనున్నారనే దానిపైనా ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. ప్రత్యేక హోదా, పాచిపోయిన లడ్డూలు, విశాఖ ఉక్కు, పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీపై వైసీపీ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తారా? ఏం చెప్పి ఓట్లు అడుగుతారు?

అప్పుడు నిప్పులు..

2014లో ఎన్నికల సమయంలో ప్రచారానికి తిరుపతికి వచ్చిన నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు.. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామంటూ తర్వాత బీజేపీ ప్రకటించింది. దీన్ని టీడీపీ కూడా సపోర్టు చేసింది. అయితే అప్పట్లో ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్.. ప్యాకేజీ పేరుతో రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీపై మండిపడ్డారు. వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీపై మండిపడ్డారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, వెంకయ్య నాయుడు తదితరులపై నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు దూరం జరిగి పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. కానీ తర్వాత మళ్లీ అదే బీజేపీతో జట్టు కట్టారు.

Also Read : కొత్తగా తమరు చెప్పేది ఏంది సునీల్ గారు ..?

ఏం చెబుతారు?

బీజేపీ, జనసేన కూటమిపై మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ‘పాచిపోయిన లడ్డూలు కాస్తా బందరు లడ్డూలు అయ్యాయా?’.. ‘పాచిపోయిన లడ్డూల్లో కిస్ మిస్ కలిపారా?’.. ‘పవన్ కల్యాణ్ కు బీజేపీ వాళ్లు మళ్లీ లడ్డూలు పంపారా?’ అంటూ మంత్రులు సహా అధికార వైసీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వండా రాష్ట్రానికి బీజేపీ మోసం చేసిందని, అలాంటి బీజేపీతో కలిసిపోయారని మండిపడుతున్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడంపై రాష్ట్ర ప్రజలు కోపంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించారు.

మరోవైపు ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రానికి కొత్తగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని ఒకపక్క చెప్తూనే, ఇప్పుడు పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇచ్చామని చెప్పిన బీజేపీ, ఇప్పుడు పుదుచ్చేరికి ఎలా ఇస్తుందని అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రచారంలో పవన్ కల్యాణ్ ఏం చెప్పబోతున్నారు? బీజేపీ, టీడీపీ, జనసేనను నమ్మి ఒక సారి మోసపోయిన తిరుపతి ప్రజలు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ మాటలను నమ్మి మరోసారి బీజేపీ అభ్యర్థికి ఓటేస్తారా?

Also Read : తిరుపతి ఉప ఎన్నికలు : జనసైనికులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ పాట్లు

Show comments