Idream media
Idream media
తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం తో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని పూర్తి చేసేశాయి. ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండేళ్ల కింద జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాతి నుంచి ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో భారీగా ఓట్లను కోల్పోయింది. దీనితో ఈ ఎన్నికలో కాస్తైనా ప్రభావం చూపించాలనే పట్టుదలతో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తో సహా అగ్ర నాయకులంతా ప్రచారంలో పాల్గొన్నారు. గత ఎన్నిక కంటే ఏమాత్రం ఓట్లు తక్కువగా వచ్చినా తమ జెండా పీకేయాల్సి వస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.
ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. జనసేన పొత్తుతో సీట్ గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే స్థానిక బీజేపీ నాయకుల ఆశలకు ఆ పార్టీ జాతీయ నాయకులే గండి కొట్టారు.ఎలాగూ గెలవని చోట తాము ప్రచారం చేసి పరువుపోగొట్టుకోవడం ఎందుకని భావించి, ఇటువైపు కన్నెత్తి చూడలేదు. పవన్ కళ్యాణ్ కూడా కేవలం ఒకే ఒక సభలో మాట్లాడి చేతులు దులిపేసుకున్నారు. దీంతో తమకు ఎలాగూ తప్పదనుకొని రాష్ట్ర నాయకులే పోరాడుతున్నారు. వీరి ప్రచారానికి కూడా స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఏం చేయాలో బీజేపీ నాయకులకు పాలుపోవడం లేదు. గత ఎన్నికలో బీజేపీకి కేవలం 16 వేల చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి.
మరోవైపు అధికార వైసీపీ మాత్రం ప్రచారంలో దూసుకెళుతోంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఎన్నిక తమ పాలనకు రెఫరెండం అని చెప్తున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ తో గెలుస్తామని స్పష్టం చేస్తున్నారు. కానీ, ప్రతిపక్ష టీడీపీ మాత్రం రెఫరెండం గురించి అస్సలు నోరు మెదపడం లేదు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ 55.03% ఓట్ షేర్‌తో 7,22,877 ఓట్లు దక్కించుకు న్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 37.65% ఓట్ షేర్‌తో 4,94,501 ఓట్లు దక్కించుకున్నారు. వైసీపీ అభ్యర్థి కి 2 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఉప పోరులో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 2 లక్షల నుంచి 3 లక్షల ఓట్లు మించి రావని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు.
అలాగే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సానుకూలత, ఇటీవల పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల ప్రభావం, మరీ ముఖ్యంగా పదేపదే జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయస్థానాల్లో కేసులు వేయడం టీడీపీపై వ్యతిరేకత పెరగడానికి దోహదం చేసే అవకాశం లేకపోలేదు. వైసీపీ అధికారం చేపట్టిన రెండేళ్లకు జరుగుతున్న ఉప ఎన్నికలో ఎలాంటి ఫలితం వస్తుందో సర్వత్రా ఎదురు చూస్తున్నారు.
Also Read : తుది అంకంలో బీజేపీ దిగాలు