8 నుంచి శ్రీవారి దర్శనం.. కానీ..?

కరోనా కారణంగా రెండు నెలలకు పైగా నిలిపివేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి మార్గం సుగమమైంది. దేశంలో లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్‌ జోన్లకే పరిమితం చేస్తూ జూన్‌ 30 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నేపథ్యంలో మరిన్ని అంశాలకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చింది. మాల్స్, హోటళు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయించింది. ఈ మినహాయింపులు జూన్‌ 8వ తేదీ నుంచి వర్తిస్తాయని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో మరో 8 రోజుల్లో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా అప్రమత్తత చర్యలు చేపట్టిన తిరుమల తిరుపతి పాలక మండలి.. స్వామి వారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం, మాస్క్, గ్లౌజ్‌లు ధరించడం తప్పని సరి చేసింది. అన్ని మార్గాల్లోనూ పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రావడమే తరువాయి.. స్వామి వారి దర్శనం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమలతోపాటు రాష్ట్రంలో ఇతర ప్రధాన దేవాలయాలు జూన్‌ 8వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. శ్రీశైలం మళ్లేశ్వరస్వామి, విజయవాడ దుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామితోపాటు అన్ని దేవాలయాలు తెరుచుకునే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. లేదంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

Show comments