Idream media
Idream media
ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం పడని వారు అంటూ ఎవరూ లేరు. మానవుడు నుంచి దేవుడు వరకూ అందరిపై కరోనా తన ప్రభావం చూపింది. ప్రజలను ఇళ్లలోనే కూర్చొపెట్టింది. భక్తులు లేకుండానే దేవ దేవతలు.. పూజలందుకోవాల్సి వచ్చింది. కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా కరోనా ఇక్కట్లు తప్పలేదు.
కరోనా వైరస్ వల్ల చరిత్రలో తొలిసారిగా రోజుల కొద్దీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి మూసివేయాల్సి వచ్చింది. దూప దీప నైవేద్యాలు తప్పా.. భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేని పరిస్థితి లాక్‌డౌన్ సమయంలో నెలకొంది. దేవాలయాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత రోజుకు ఆరు వేల చొప్పున భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించిన అధికారులు.. మెల మెల్లగా ఆ సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. వైరస్ ప్రభావం తగ్గే కొలదీ.. భక్తుల సంఖ్యను పెంచుతున్నారు.
ప్రస్తుతం శ్రీవారిని రోజుకు 30 వేలకు పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. సాధారణ రోజులతో పోల్చితే ఈ సంఖ్య తక్కువైనప్పటికీ.. తిరుమలలో మునపటి కళ కనిపిస్తోంది. భక్తుల హడావుడి, తలనీలాల సమర్పణ, వ్యాపారాలు మునపటి స్థితికి చేరుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం కూడా రోజుకు రెండు కోట్ల రూపాయలు వస్తోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2.26 కోట్ల రూపాయలు రావడం విశేషం. సాధారణ రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల రూపాయలకుపైబడి వచ్చేది. శెలవు దినాలు, పర్వదినాల్లో అయితే హుండీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయలు ఉంటోంది. ప్రస్తుతం అంత మొత్తం రాకపోయినా.. కోవిడ్ ప్రభావం నుంచి వెంకన్న కోలుకున్నట్లే కనిపిస్తోంది. భక్తుల రాక, హుండీ ఆదాయం తదితర వ్యవహారాలు పూర్వ స్థితి వైపునకు సాగుతుండడంతో శ్రీవారి భక్తుల్లో ఆనందం నెలకొంది.