iDreamPost
android-app
ios-app

ఎన్నికల ముందు కొత్త ఫలితాలు దడ దడ!

ఎన్నికల ముందు కొత్త ఫలితాలు దడ దడ!

ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్స్ సందడి మొదలవుతుంది. తాజాగా దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై “టైమ్స్ నౌ సీ ఓటర్” ఒపీనియన్ పోల్స్ ను విడుదల చేసింది. గతంలోనే ఈ సంస్థ చేసిన ఒపీనియన్ పోల్స్ కు ఇది తుది రూపం గా పేర్కొంది. మొదటి విడత ఎన్నికలు మొదలవుతున్న వేళ ఇప్పుడు ఇవి చర్చనీయాంశంగా మారుతున్నాయి.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతటా ఉత్కంఠ కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని ‘టైమ్స్‌ నౌ – సీ ఓటర్‌’ ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలు వెల్లడించింది. భాజపా గట్టి పోటీ ఇచ్చినా.. దీదీ ధాటికి తట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు సాధించబోదని అభిప్రాయపడింది.

వెస్ట్ బెంగాల్‌లో భాజపా దూకుడును తట్టుకొని, తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ కు దక్కుతుందనేది అంచనా. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా.. 2016లో రాష్ట్రంలో కేవలం మూడు సీట్లకు పరిమితమైన కమలదళం.. ఈసారి వందకు పైగా స్థానాలను గెల్చుకోనుంది అని సర్వేలో తేలింది. అయితే అధికారానికి కావాల్సిన అన్ని సీట్లు మాత్రం సాధించక పోవచ్చని అభిప్రాయపడింది. తృణమూల్ కాంగ్రెస్కు 152 నుంచి 168 మధ్య సీట్లు వస్తే, బిజెపి కు 104 నుంచి 120 సీట్లు సాధించవచ్చని, వామపక్ష కూటమి 18 నుంచి 26 సీట్ల మధ్య ఉండవచ్చని వెల్లడించింది.

కేరళలో వామపక్ష కూటమికి ఈ దఫా సీట్లు కాస్త తగ్గినప్పటికీ, అధికారాన్ని మాత్రం నిలబెట్టుకునే స్థాయిలో ఎల్డీఎఫ్ కూటమికి సీట్లు లభించవచ్చని ఒపీనియన్ పోల్స్ జోస్యం చెప్పింది. రాహుల్గాంధీ వరుస పర్యటనలు అంతగా ప్రభావం చూపించక పోవచ్చు అని అభిప్రాయపడింది. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో ఈసారి 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చని, యుడీఎఫ్ కు 62 సీట్లు రావొచ్చని తెలిపింది. బిజెపి ప్రభావం చాలా తక్కువగా కేరళలో కనిపిస్తోందని అభిప్రాయపడింది.

Also Read : ‘మహా’ముదురు..! మహారాష్ట్ర ను కుదిపేసిన సచిన్ వాజే అసలు కథ..

పాండిచ్చేరిలో ఈసారి ప్రభుత్వం మారిపోతుందని సి ఓటర్ సర్వే తెలిపింది. 30 సీట్లు ఉన్న పాండిచ్చేరి అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి 19 నుంచి 23 సీట్లు మధ్య విజయం సాధించవచ్చని, కాంగ్రెస్ డీఎంకే కూటమి కేవలం 7 నుంచి 11 స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నది ఒపీనియన్ పోల్ సారాంశం. కమల్ హాసన్ పార్టీ పాండిచ్చేరిలో అసలు ఏమాత్రం పోటీలో కూడా ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.

అస్సాంలో ఈసారి అధికార భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని, అయితే భారీగా సీట్లను నష్టపోయే ప్రమాదం మాత్రం ఉంది అని సి ఓటర్ సర్వే తెలిపింది. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఎన్డీఏ కూటమి 65 నుంచి 73 సీట్ల మధ్య సాధించి రమారమి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని, అదే సమయంలో కాంగ్రెస్ పక్షాలు అన్నీ కలిపి కూడిన మహాజాత్ కూటమికి 52 నుంచి 60 సీట్లు లభించి బలమైన ప్రతిపక్షంగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

తమిళనాడులో ఈ సారి అధికారం మార్పు కాయం గా కనిపిస్తోంది అన్నది టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే అభిప్రాయం. కరుణానిధి కుమారుడు స్టాలిన్ నేతృత్వంలోని డి.ఎం.కె కూటమికి సానుకూల పవనాలు వీస్తున్నాయి అని, అద్భుతమైన విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడులో డీఎంకే కూటమి 173 నుంచి 181 సీట్ల మధ్య గెలుచుకోవచ్చని, అన్నాడీఎంకే బి జె పీ కూటమికి 45 నుంచి 53 మధ్య మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉందని, తమిళనాడులో డీఎంకే కూటమి పూర్తిస్థాయిలో మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి.

ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఈ మధ్య కాలంలో అన్ని తారుమారై వస్తున్నాయి. బిహార్, ఢిల్లీ ఎన్నికల్లోనూ ఇదే తేలింది. ఏ సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్ కూడా సరైన ఫలితాలను అందించలేదు. ఎప్పుడు ఎన్నికలు ముందే ఒపీనియన్ పోల్స్ లో చెప్పిన విషయాల పట్ల ఎంత నమ్మాలి..? నమ్మాల్సిన అవసరం లేదు.? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి.

Also Read : విపక్షాల వంకలు.. అధికారపక్షంలో ఉత్సాహం !