iDreamPost
android-app
ios-app

హోమ్ ఎంటర్టైన్మెంట్ సత్తా ఇది

  • Published Aug 04, 2021 | 9:43 AM Updated Updated Aug 04, 2021 | 9:43 AM
హోమ్ ఎంటర్టైన్మెంట్ సత్తా ఇది

అసలు సినిమాలు థియేటర్లలోనే చూడాలా. నిజమే. అందులో దక్కే అనుభూతి స్మార్ట్ ఫోన్లలో, టీవీలలో దొరకదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ కరోనా వచ్చాక ఈ లెక్కలు మారిపోయాయి. హోమ్ ఎంటర్ టైన్మెంట్ కున్న మార్కెట్ పవర్ అంతర్జాతీయ సంస్థలు గుర్తించడం మొదలుపెట్టాయి. అందులో ఎంత సత్తా ఉందో బాక్సాఫీస్ లెక్కల సాక్షిగా ప్రత్యక్షంగా చూస్తున్నాయి. ప్రేక్షకుడు కొత్త మూవీని చూడాలని డిసైడ్ అయితే తనకు అనుకూలంగా ఏది అనిపిస్తే దానికి మారతాడు తప్ప థియేటర్లోనే చూసి తీరాలనే నియమాన్ని ఈ వైరస్ పాండెమిక్ వచ్చాక మార్చుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

ఇటీవలే ఓవర్సీస్ లో అటు థియేటర్లలో ఇటు సదరు సంస్థల ఓటిటిలలో ఒకే రోజు రిలీజైన సినిమాలు తెచ్చిన కలెక్షన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బ్లాక్ విడో, జంగల్ క్రూజ్, ఎఫ్9 న్యూ ఎడిషన్ సినిమాల వసూళ్లు ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్నాయి. థియేటర్లలోనే ఎక్కువ సొమ్ములు వచ్చినప్పటికీ పే పర్ వ్యూలో తక్కువేమి రాలేదు. ఉదాహరణకు బ్లాక్ విడోనే తీసుకుంటే డిస్నీ ప్రీమియర్ స్ట్రీమింగ్ ద్వారా వచ్చిన సొమ్ము అక్షరాలా 80 మిలియన్ల డాలర్లట. అంటే మన కరెన్సీలో 600 కోట్లు. జంగల్ క్రూజ్ సైతం కేవలం మూడు రోజుల్లో 30 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వసూలు చేసింది. ఇదంతా ఇళ్లలో చూసిన ఆడియన్స్ నుంచి వచ్చిందే.

ఈ పరిణామాలు గమనిస్తే విదేశాల్లో ఏ స్థాయిలో కరోనా ప్రభావం చూపించిందో అర్థమవుతోంది. ఈ ట్రెండ్ ఇకపై మరిన్ని కొత్త పుంతలు తొక్కడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. పెద్ద తెరమీద చూసే వినోదానికి ఏదీ సాటి రానప్పటికీ ఆరోగ్యం కన్నా అది ముఖ్యం కాదు కాబట్టి అధిక శాతం అమెరికన్లు తమకు హోమ్ థియేటర్ చాలని చెబుతున్నారట. మన దగ్గర కూడా సల్మాన్ ఖాన్ రాధేతో ఇలాంటి ప్రయోగం చేశారు కానీ అది మరీ డిజాస్టర్ మూవీ కావడంతో సరైన రీతిలో స్పందన దక్కలేదు. అలా కాకుండా ఏదైనా దమ్మున్న కథతో స్టార్ హీరో సినిమా ఇలాంటి మోడల్ లో వస్తే ఇండియాలోనూ ఇది సక్సెస్ అవుతుందంటున్నారు. చూద్దాం ఆ రోజూ వస్తుందేమో

Also Read : పాన్ ఇండియా ప్లాన్ కు రెండు చిక్కులు