iDreamPost
android-app
ios-app

దారి చూపించిన తిమ్మరుసు

  • Published Jul 09, 2021 | 6:00 AM Updated Updated Jul 09, 2021 | 6:00 AM
దారి చూపించిన తిమ్మరుసు

ఎట్టకేలకు మూడు నెలలుగా థియేటర్ కు దూరమైన సగటు తెలుగు ప్రేక్షకుడికి ఊరట కలిగించేలా మొదటి రిలీజ్ ప్రకటన వచ్చేసింది. సత్యదేవ్ హీరోగా రూపొందిన తిమ్మరుసు ఈ నెల 30 విడుదల చేయబోతున్నారు. దీని మీద కూడా ఓటిటి ప్రచారం జరిగింది కానీ పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా మారడంతో నిర్ణయం మార్చుకున్నారు. క్రైమ్ కం కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ థ్రిల్లర్ లో టాక్సీ వాలా ఫేమ్ ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఆ మధ్య వచ్చిన టీజర్ ఓ మోస్తరు అంచనాలు రేపడంతో ఇప్పుడు ట్రైలర్ ని సిద్ధం చేస్తున్నారు.

నిజానికి ఒకటి రెండు చోట్ల తప్ప తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎక్కడా ఓపెన్ కాలేదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో తమ వినతులకు అనుగుణంగా ప్రభుత్వాల నుంచి స్పందన వస్తుందన్న నమ్మకంతో ఎగ్జిబిటర్లు ఇంకా వేచి చూస్తున్నారు. పాత సినిమాలు వేసుకుని నిర్వహణ భారాన్ని మోసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకే హైదరాబాద్ లోనూ మల్టీ ప్లెక్సులతో సహా ఏ హాలు తెరుచుకోలేదు. ఇదంతా ఎలా ఉన్నా ఖచ్చితంగా మరో రెండు వారాల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతోనే తిమ్మరుసు మొదటి అడుగు వేసినట్టు కనిపిస్తోంది.

ఇప్పుడీ అనౌన్స్ మెంట్ తిమ్మరుసుకు పలు రకాలుగా కలిసి వస్తుంది. ఇంత గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద వస్తున్న సినిమా కావడంతో ఓపెనింగ్స్ ని బాగానే ఆశించవచ్చు. జనం రారనే సందేహం అక్కర్లేదు. అన్నిచోట్లా తిరుగుతున్న పబ్లిక్ ఒక్క థియేటర్లకు మాత్రమే భయపడతారనుకోవడం సిల్లీనే. కాకపోతే క్రౌడ్ ని కాస్త బలంగా ఫుల్ చేసే స్టార్ హీరోల సినిమాలు వీలైనంత త్వరగా రావాలి. సత్యదేవ్ లాంటి వాళ్ళు ఇంకా ఆ స్థాయి కాదు. లవ్ స్టోరీ టైపు హైప్ ఉన్న మూవీస్ అయితేనే ఎక్కువ జనం హాళ్లకు వస్తారు. మరి తిమ్మరుసు వేసిన బాటలో రాబోయే రోజులో ప్రకటనల వర్షం కురిసేలా ఉంది