Krishna Kowshik
Krishna Kowshik
ఆడ పిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోతున్న తల్లిదండ్రులు.. ఒక అయ్య చేతిలో పెట్టే వరకు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పుట్టింట్లో ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిపోతుంటుంది ఆడపిల్ల జీవితం. చిన్న తప్పు చేస్తే తల్లి మందలిస్తుందేమో కానీ.. తండ్రి మాత్రం తన అల్లరిని చూసి మురిసిపోతుంటాడు. కూతురు అడగడమే ఆలస్యం.. కొండ మీది కోతినైనా తీసుకువస్తుంటాడు తండ్రి. అన్నీ తన ఇష్టప్రకారమే నడిచే తండ్రి.. పెళ్లి దగ్గరకొచ్చేసరికి కూతురు అభిప్రాయాలకు నామమాత్రపు విలువ ఇస్తుంటాడు. తండ్రి చూపించిన అబ్బాయి చేత కిక్కురుమనకుండా తాళి కట్టించుకుంటుంది కూతురు. అల్లుడికి అడిగినంత కట్నం ఇచ్చి, అంగరంగ వైభవంగా కుమార్తెకు పెళ్లి చేసి పంపించాక అసలు కథ మొదలు అవుతుంది. ఇచ్చిన కట్నం డబ్బులు చాలడం లేదని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అత్తింటివారు. ఈ బాధను భరించలేక తల్లడిల్లపోతుంది కుమార్తె. తండ్రిని అడగలేక, అత్తింట్లో చెప్పుకోలేక తనువు చాలిస్తోంది.
ఆడపిల్ల దొరకడమే కష్టమౌతున్న ఈ రోజుల్లో.. అతడికి కుందనపు బొమ్మల్లాంటి అమ్మాయితో పాటు 30 లక్షల కట్నం, అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు వధువు తల్లిదండ్రులు. కూతురు సుఖం కోసం ఇంత ఖర్చు చేసిన ఆ తల్లిదండ్రులకు పుత్రికా శోకం మిగిల్చాడు అల్లుడు. పెళ్లై ఏడాదిన్నర గడిచిందో లేదో అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడంతో ఆ అబల రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని నెలమంగల తాలూకా తిరుమలెగౌడనపాళ్య గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ గ్రామానికి చెందిన కిరణ్ తో భవ్యకు వివాహమైంది. 30 లక్షల కట్నంతో పాటు వైభవంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఏడాది గడిచినా భవ్యకు పిల్లలు కలగకపోవడంతో సూటిపోటి మాటలతో హింసించడం మొదలు పెట్టారు అత్తింటివారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రాజీ కుదిర్చారు. అయినా వేధింపులు తగ్గకపోవడంతో భవ్య తన పుట్టింటికి వచ్చేసింది. తన జీవితం ఇలా అయిపోయిందన్న మానసిక వేదన చెందిన భవ్య.. రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. భవ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.