Idream media
Idream media
1969లో విచిత్ర కుటుంబం సినిమా వచ్చింది. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు ముగ్గురు హీరోలు ఆ కుటుంబంలో ఎలాంటి విచిత్రం కనపడదు. వూరికే టైటిల్ జస్టిఫికేషన్ కోసం చివరల్లో విలన్ నాగభూషణం “మీది విచిత్ర కుటుంబంలా వుందే” అని అంటాడు.
టైటిల్స్‌లో కూడా ట్రెండ్ నడుస్తూ వుంటుంది. కొంత కాలం బంగారు, బంగారు పిచుక , బంగారు మనిషి, బంగారు కలలు…ఇలా
కొంతకాలం నిండు… నిండు దంపతులు, నిండు దాంపత్యం, నిండు మనుషులు, నిండు హృదయాలు
కుటుంబం టైటిల్ కొన్నాళ్లు. ఆదర్శ కుటుంబం, ఉమ్మడి కుటుంబం, మంచి కుటుంబం.
టైటిల్‌కి సినిమాకి సంబంధమే లేని వాటిలో విచిత్ర కుటుంబం ఒకటి. అయితే సినిమాలో మాత్రం విచిత్రాలున్నాయి.
*ముగ్గురు హీరోలున్న సినిమాని 90 శాతం స్టూడియోలోనే లాగించేశారు.
*ఎన్టీఆర్ లాయర్, ఆయన ఇంట్లో కూడా నల్లకోటు, కూలింగ్ గ్లాసెస్‌తో వుంటాడు. విలన్ నాగభూషణం కొన్ని సీన్స్‌లో ఇంట్లో ఫుల్‌సూట్‌లో వుంటాడు. ఒక చిన్న టవున్‌లో భూకబ్జాలు చేసుకునే వాడికి ఫుల్‌సూట్ ఎందుకో తెలీదు.
*ఒక సీన్‌లో చెల్లిగా పాటపాడిన సంధ్యారాణి మళ్లీ సినిమాలో ఎక్కడా కనపడదు. విచిత్ర కుటుంబమంటే ఇదేనేమో
*69లో ఫుల్ స్పీడ్‌లో వున్న ఎన్టీఆర్‌కి సినిమాలో ఒక్క పాట కూడా లేకపోవడం విశేషం
*నాగభూషణంపై భమిడిపాటి రాధాకృష్ణ డైలాగ్‌లు పేలాయి
*ఒకే ఫైట్ కాసేపు స్టూడియోలో, కాసేపు అవుట్ డోర్‌లో నడుస్తుంది. కృష్ణ ఫైట్ చేస్తే స్టూడియోలో, ఆయన డూప్ ఉంటే అవుట్‌డోర్
*ఆడవే జలకమ్ములాడవే పాట మొత్తం హంపీలో తీసారు
*ఎప్పటిలాగే ఎన్టీఆర్ మారువేషం సీన్ ఉంది. గండ్ర గంగన్న అని బుగ్గన కత్తిగాటు, కోరమీసంతో వస్తే భార్య సావిత్రి కూడా పట్టదు. చిక్కడ్‌పే రక్కా ఆయన వూత పదం. రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాశ్‌రావు దీనికి దర్శకుడు. తండ్రి స్ఫూర్తితో రాఘవేంద్రరావు కూడా ఎన్టీఆర్‌తో మారువేషాలు వేయించాడు. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్
*ఒక హత్యని చూసిన సావిత్రి, ఆ విషయం ఎన్టీఆర్‌కి అపుడే చెబితే గంట సినిమా తగ్గేది.
*శోభన్‌కి జోడీగా మళయాళ నటి షీలా నటించింది (చంద్రముఖిలో ముసలమ్మ గుర్తుందా? ఆవిడే షీలా)
*నాగభూషణం డెన్‌లో స్విచ్ నొక్కితే తలుపులు తెరుచుకుంటాయి. టెక్నాలజీ ఎప్పుడూ విలన్లకే అందుబాటులో వుంటుంది.
*ప్రభాకర్‌రెడ్డి ఆచూకీ తెలుసుకోడానికి రాజబాబు, మీనాకుమారి ఒక పాట పాడతారు. విలన్ ఆచూకీ తెలుసుకోడానికి పాట పాడడం ఒక ఫార్ములా. అన్వేషణలో వంశీ కూడా వాడాడు దీన్ని.
*ఎన్టీఆర్ తన మీసం తీసేసి మారువేషం నుంచి బయటికొస్తే కృష్ణ అద్భుతమైన Expresion ఇస్తాడు.
ఒకే రకమైన Expresions ఇవ్వడంలో కృష్ణకి పోటీలేదు.