ఇలాంటి కలెక్షన్లతో మళ్ళీ మూయాల్సిందే

థియేటర్లు తెరుచుకున్న ఆనందం బాలీవుడ్ కు రవ్వంత కూడా మిగలడం లేదు. రిలీజైన సినిమాల ఫలితాలు కలెక్షన్లు చూసి మిగిలిన నిర్మాతల ధైర్యం కూడా నీరుగారి పోతోంది. మొదటగా వచ్చిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ ఇప్పటిదాకా బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోలేదు. చేసిందే తక్కువ బిజినెస్. అది రాబట్టుకోవడానికే నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చెహరే వంతు వచ్చింది. దీనికి వచ్చిన వసూళ్లు మరీ తీసికట్టుగా ఉండటం చూస్తే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ నమోదు కావడం ఖాయమని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ స్టేజి నుంచే దీని మీద జనం పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం దీనికి మొదటి రోజు వచ్చిన లెక్క కేవలం 43 లక్షలు. రెండో రోజు కొంత మెరుగ్గా 60 లక్షలు రాబట్టగా మూడో రోజు ఆదివారం కావడంతో ఇంకాస్త మెరుగ్గా 75 లక్షలు తెచ్చింది. మొత్తం కలిపి పట్టుమని రెండు కోట్లు కూడా రాలేదు. ఇవాళ నుంచి వీక్ డేస్ కాబట్టి డ్రాప్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముప్పై లక్షలు వస్తే గగనమనే స్థాయిలో టికెట్ కౌంటర్లు బోసిపోవడం ఖాయమని ఢిల్లీ వర్గాల సమాచారం. దానికి తోడు చెహరేకు కనీసం యావరేజ్ టాక్ రాకపోవడం ఇంకా దెబ్బేసింది. కంటెంట్ విషయంలో సెకండ్ హాఫ్ కంప్లయింట్లు రన్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇంకో రెండు రోజుల్లో వాష్ అవుట్ ఖాయమే.

ఇప్పుడీ లెక్కలు చూస్తూ ఇతర నిర్మాతల గుండెలు జారిపోతున్నాయి. తమ సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే మీమాంసలో పడుతున్నారు. కనీసం ఓటిటికి వెళ్తే పెట్టుబడికి గ్యారెంటీ ఉండటంతో పాటు నిశ్చింతగా ఉండొచ్చు. భుజ్, షేర్షా, మిమి లాంటి చిత్రాలు డిజిటల్ రిలీజ్ అందుకోవడం వల్ల చాలా సేఫ్ అయ్యాయి. కోట్లాది ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న తరుణంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనం థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో చెహరే ఒక పాఠంలా నిలుస్తోంది. ఇదిలాగే కొనసాగిస్తే సూర్యవంశీ, 83 లాంటి భారీ సినిమాలు ఈ ఏడాది రావడం అనుమానమే.

Also Read : సినిమా పబ్లిసిటీ కోసం కొత్త స్టంటులు

Show comments