iDreamPost
android-app
ios-app

Salman Rushdie : సల్మాన్ రష్దీ ఎవరు? 33 ఏళ్లు గడిచినా, ‘ది సాటానిక్ వెర్సెస్’ ఎందుకు వివాదాస్పదం?

  • Published Aug 13, 2022 | 4:51 PM Updated Updated Aug 13, 2022 | 5:02 PM
Salman Rushdie : సల్మాన్ రష్దీ ఎవరు?  33 ఏళ్లు గడిచినా, ‘ది సాటానిక్ వెర్సెస్’ ఎందుకు వివాదాస్పదం?

ప్రతి యేడాది ఫిబ్రవరి 14న, సల్మాన్ రష్దీకి ఇరాన్ నుంచి ఒక రిమైండ‌ర్ అందుతుంది. అదే ఫ‌త్వా. 1989లో ఆ తేదీన అయతోల్లా ఖొమేని మొదటిసారిగా విధించిన ఫ‌త్వా ఇంకా అమ‌ల్లోనే ఉంద‌న్న‌ది ఆ రిమైండ‌ర్ సారాంశం. ఖొమేని ఇరాన్ రాజకీయ, మతపరమైన దిగ్గ‌జ నాయ‌కుడు. 1979 నుండి అతని మరణం వరకు ఇరాన్ కు అత‌నే అత్యున్నత నేత‌. అతని ఫ‌త్వా ఇప్ప‌టికీ అమ‌ల్లోనే ఉంది.

స‌ల్మాన్ ర‌ష్దీ తల $2.8-మిలియన్ల వెల‌క‌ట్టాడు అయ‌తోల్లా ఖొమేని. ఫ‌త్వా అంటే మరణశిక్షను అమలు చేయడానికి ప్రయత్నించి చ‌నిపోయిన ఎవరైనాస‌రే, స్వర్గానికి వెళ్లే “అమరవీరుడు”గా పరిగణించాల‌న్న‌ది అప్పటి 89 ఏళ్ల ఖొమేనీ ప్ర‌కట‌న‌. దీన్ని ఇప్ప‌టికీ పాటిస్తున్నారు.

ఇస్లాం పవిత్ర విలువలను కించపరిచే సాహసం ఎవరూ చేయకుండా, ప్రపంచంలోని ముస్లింలు అంద‌రూ పుస్తక రచయిత, ప‌బ్లిష‌ర్ ను తొంద‌ర‌గా ప‌ట్టుకొని ఉరితీయాల‌ని కోరాడు.

సల్మాన్ రష్దీ మీద ఇరాన్ అధినేత‌కు ఎందుకంత ఆగ్ర‌హం? ఎందుకు ఫ‌త్వాను జారీచేశారు? సెప్టెంబరు 1988లో ది సాటానిక్ వెర్సెస్(The Satanic Verses) అనే పుస్తకాన్ని స‌ల్మాన్ ర‌ష్దీ రచించారు. ఇందులో ముహమ్మద్ ప్రవక్త జీవితంలోని అనేక ఘ‌ట్ట‌ల‌ను క‌ల్పితంగా రాశాడు. చాలా మంది ముస్లింలకు ఇది అభ్యంతక‌రం. కొంద‌రైతే దీన్ని దైవదూషణగా భావించారు. ఆగ్ర‌హించారు.

రష్దీ తన నవల ప్రచురించిన దాదాపు ఆరు నెలల త‌ర్వాత నుంచి ఫత్వా భ‌యంతోనే బ‌తుకుతున్నాడు. ఆయ‌న ఎక్క‌డి వెళ్తున్నాడో ఎవ‌రికీ చెప్ప‌రు. పోలీసుల ర‌క్ష‌ణ‌లోనే ఆయ‌న బైట‌కొస్తారు. ది సాటానిక్ వెర్సెస్ రష్దీ నాలుగో నవల.

ఫ‌త్వా(fatwa) అంటే ఏమిటి?

ఫత్వా అనేది మ‌త‌ప‌ర‌మైన చ‌ట్ట ప్ర‌క‌ట‌న‌. ఇది ముఫ్తీ అనే పెద్ద అభిప్రాయం. ఇస్లాంకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన సమస్యలపైనా తన తీర్పులను, తన అభిప్రాయాలను చెప్పే అధికార‌మున్న ఇస్లామిక్ న్యాయ పండితుడు. కొన్ని సందర్భాల్లో, ఫత్వా ఒక‌రికి మ‌ర‌ణ‌శిక్ష‌ను విధిస్తుంది. దానికి తిరుగులేదు.

ఫత్వా రాకముందే భారతదేశం వెంట‌నే ఈ పుస్త‌కాన్ని నిషేధించింది. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్, సూడాన్, శ్రీలంకతో సహా అనేక దేశాలలో ఈ పుస్తకాన్ని నిషేధించారు. ఫిబ్రవరి 1989లో బొంబాయిలో జరిగిన అల్లర్లలో 12 మంది, ఇస్లామాబాద్‌లో జరిగిన మరో అల్లర్లలో ఆరుగురితో సహా, ది సాటానిక్ వెర్సెస్ ను బ్యాన్ చేయాలంటూ చేసిన నిర‌స‌న‌ల్లో చాలామంది చ‌నిపోయారు. ఒక విధంగా ఇస్లామిక్ ప్ర‌పంచం ది సాటానిక్ వెర్సెస్ ను గ‌ర్హించింది. నిషేధించింది. పుస్తకాలు తగులబెట్టారు. అదే నెలలో అమెరికాలో పుస్తకాన్ని ప్రచురించిన తర్వాత బుక్ షాపుల‌పై దాడులు జ‌రిగాయి. బెదిరింపులు వెళ్లాయి. చాలా దేశాలు ది సాటానిక్ వెర్సెస్ ని నిషేధించాయి.

ఫత్వా తర్వాత, రష్దీ క్షమాపణ చెప్పాడు. త‌ప్పుజ‌రిగింద‌ని విచారం వ్యక్తం చేశాడు, అయినా ఇరాన్ తిరస్కరించింది.

ఫత్వా జారీ చేసేట‌ప్ప‌టికి లండన్‌లో నివసిస్తున్న‌ రష్దీ వెంటనే బ్రిటీష్ పోలీసుల నుండి 24 గంటల రక్షణతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆచూకీ తెలియ‌కుండా ప్రతి మూడు రోజులకు ఒక చోటి నుండి మరొక ప్రాంతానికి వెళ్లేవాడు. ప్ర‌తిరోజూ ప్రాణ‌భ‌యంతో తిరిగాడు. 13 ఏళ్ల‌పాటు జోసెఫ్ అంటోన్ అనే మారుపేరుతో వారానికి రెండు ప్రాంతాలు చొప్ప‌న మారాల్సి వ‌చ్చింది. మొదటి ఆరు నెలల్లో 56 సార్లు ఒకే చోట ఉండ‌కుండా వేర్వేరు ప్రాంతాల్లో తిరిగాడు. దీనికితోడు అత‌ని భార్య అమెరికన్ నవలా రచయిత్రి మరియాన్ విగ్గిన్స్‌తో విడిపోవడంతో ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారింది.

1991లో రష్దీ తన ర‌హ‌స్య జీవితం నుంచి నెమ్మ‌దిగా బైట‌కొచ్చాడు. మ‌రి ఫ‌త్వా సంగ‌తేంటి? అతని జపనీస్ అనువాదకుడిని అదేయేడు చంపేశారు. అతని ఇటాలియన్ అనువాదకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. రెండేళ్ల త‌ర్వాత నార్వేజియన్ పబ్లిషర్ ని కాల్చిచంపారు. అయితే ఈ దారుణాల‌కు ఖొమేనీ ఫ‌త్వాకు సంబంధ‌ముందా? ఇరాన్ చెప్ప‌లేదు.

సాహిత్యానికి రష్దీ సేవలకు గాను 2007లో క్వీన్ ఎలిజబెత్ II చేత నైట్ బిరుదు ఇచ్చిన‌ప్పుడు చాలా మంది ముస్లింలు ఆగ్ర‌హించారు. చాలా ఏళ్లు నీడ‌లో బ‌తికిన త‌ర్వాత న‌లుగురిలో క‌ల‌వ‌డం మొద‌లుపెట్టాడు. పాశ్చాత్య దేశాలలో చాలా హీరోగా చూశారు. అయినా ప్ర‌తియేడూ ఫ‌త్వా రిమైండ‌ర్ వ‌స్తూనే ఉంది.

శుక్రువారం క‌త్తిదాడి వ‌ర‌కు ర‌ష్దీ సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతున్నాడు. ఫ‌త్వా సంగ‌తి మ‌ర్చిపోయాడు. కాని నిందుతుడు మాత్రం మ‌ర‌ణ‌శిక్ష‌ణ‌ను అమలుచేయ‌డానికే నిర్ణ‌యించుకున్నాడు.