Idream media
Idream media
అక్టోబరు 19,1986 ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య బొంబాయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్ ఆఖరి రోజున ఆస్ట్రేలియా కెప్టెన్ అలాన్ బోర్డర్ సాధించిన రికార్డు అందరూ మిస్ అయ్యారు. ఏ మ్యాచ్ లో అయినా ఏదైనా కొత్త రికార్డు సృష్టించబడుతుందా అని వేచి చూసే క్రికెట్ గణాంకవేత్తలు కూడా ఆ రోజు ముగిసిన భారత రెండవ ఇన్నింగ్స్ లో ముగ్గురు బొంబాయి ఆటగాళ్లు సెంచరీలు సాధించడాన్ని రికార్డు చేశారు కానీ, బోర్డర్ రికార్డు ఆ తర్వాత కొన్ని రోజులకు కానీ గుర్తిఓచలేకపోయారు.
ఆ సిరీస్ లో మద్రాసులో జరిగిన మొదటి మ్యాచ్ టైగా ముగిసి, అప్పటివరకు టెస్టు క్రికెట్ చరిత్రలో టైగా ముగిసిన రెండవ మ్యాచ్ గా రికార్డు పుస్తకల్లోకి ఎక్కింది. ఢిల్లీలో జరిగిన రెండవ టెస్టు కూడా డ్రాగా ముగియడంతో, కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు మూడవ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేయగా, దానికి సమాధానంగా భారత జట్టు అయిదు వికెట్ల నష్టానికి 517 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇందులో ముగ్గురు బొంబాయి బ్యాటర్లు, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, రావిశాస్త్రి సెంచరీలు సాధించారు. హోమ్ గ్రౌండ్లో ఆడుతూ ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు సాధించడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండో సారి. 1984లో ఇంగ్లాండు మీద న్యుజీలాండ్ లోని ఆక్లాండులో ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఈ రికార్డు సాధించారు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలయ్యాక పిచ్ సహకారం ఏమాత్రం లేకపోవడంతో మ్యాచ్ డ్రా దిశగా పయనించసాగింది. ఆ మ్యాచ్ లో టెస్టు క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన భారత స్పిన్నర్ వేసిన ఇన్నింగ్స్ లో 83 వ ఓవర్, అతని అయిదవ ఓవర్ అయిదవ బంతికి ఆస్ట్రేలియా ఆటగాడు డీన్ జోన్స్ సింగిల్ తీశాడు. ఆ పరుగుతో టెస్టు క్రికెట్ మొదలయినప్పటినుంచి జరిగిన అన్ని మ్యాచ్ ల్లో అందరు ఆటగాళ్లు సాధించిన పరుగులు కలిపితే 9,99,999 అయ్యాయి. ఆ తరువాత బంతికి అలాన్ బోర్డర్ బౌండరీ సాధించి టెస్టు క్రికెట్ చరిత్రలో మిలియన్ పరుగులు పూర్తి చేశాడు.
కొంత గందరగోళం
అప్పుడు గుర్తించలేకపోయినా ఆ తర్వాత కొంతమంది క్రికెట్ గణాంకవేత్తలు డీన్ జోన్స్ సాధించింది పది లక్షలవ పరుగు అని ప్రకటించారు. దీనికి కారణం 1906లో దక్షిణాఫ్రికా లోని జోహాన్నెస్ బర్గ్ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండుల మధ్య జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్ లో స్కోరు 34/1 గా క్రికెట్ బైబిల్ గా పరిగణించే విజ్డెన్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ మ్యాచ్ స్కోరు కార్డు లభించడంతో ఆ స్కేరు 33/1 అని సవరించారు. ఇది తెలియని కొందరు పది లక్షలవ పరుగు సాధించింది డీన్ జోన్స్ అని భావించినా, వెంటనే సరి చేసుకుని పది లక్షలవ పరుగు సాధించింది అలాన్ బోర్డర్ అని సరిదిద్దుకున్నారు.
109 సంవత్సరాలకు మొదటి మిలియన్
మార్చి 15,1877 న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్ల మధ్య జరిగిన మొట్టమొదటి అధికారిక టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తరఫున మొదటి పరుగు, మొదటి సెంచరీ సాధించిన ఛార్లెస్ బ్యానర్ మాన్ తర్వాత 109 సంవత్సరాలు, 1054 టెస్టు మ్యాచ్ లు ఆడి అన్ని దేశాలకు చెందిన అందరు ఆటగాళ్లు కలిసి పది లక్షల పరుగులు సాధించారు. అయితే రెండవ మిలియన్ పరుగులు సాధించడానికి పట్టిన సమయం 26 సంవత్సరాలు మాత్రమే. ఈ ఇరవై ఆరు సంవత్సరాలలో పాత జట్లతో కలిసి కొత్తగా టెస్టు హోదా సాధించిన జట్లు అన్నీ కలిసి 985 టెస్టు మ్యాచులాడి పది లక్షల పరుగులు సాధించాయి.
ఏప్రిల్ 3,2012 న కొలంబోలో ఇంగ్లాండు మీద జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు మహేలా జయవర్ధనే జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ లో ఇరవై లక్షలవ పరుగు సాధించాడు.