iDreamPost
android-app
ios-app

8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు ఖతార్ ఉరి శిక్ష..!

ఉద్యోగం కోసం వెళ్లిన ఎనిమిది మంది భారతీయ మాజీ నౌవికాదళ అధికారులను ఖతార్.. గూఢచర్యం ఆరోపణల కింద గత ఏడాది నిర్భంధం విధించింది. పలు మార్లు బెయిల్ కోసం పోరాడినా తిరస్కరించింది స్థానిక కోర్టు..తాజాగా కఠినమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పు పట్ల భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఉద్యోగం కోసం వెళ్లిన ఎనిమిది మంది భారతీయ మాజీ నౌవికాదళ అధికారులను ఖతార్.. గూఢచర్యం ఆరోపణల కింద గత ఏడాది నిర్భంధం విధించింది. పలు మార్లు బెయిల్ కోసం పోరాడినా తిరస్కరించింది స్థానిక కోర్టు..తాజాగా కఠినమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పు పట్ల భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది.

8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు ఖతార్ ఉరి శిక్ష..!

ఎనిమిది మంది భారతీయుల పట్ల ఖతార్ తీసుకున్న కఠిన నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై గత ఏడాది ఆగస్టులో ఎనిమిది మంది భారతీయ నౌకాదళ మాజీ సిబ్బందిని ఖతార్ అరెస్టు చేసింది. అప్పటి నుండి ఖతార్ నిర్భంధంలోనే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 25న వారిపై అభియోగాలను నమోదు చేసిన ప్రభుత్వం.. అక్కడ చట్టాల ప్రకారం విచారణ చేపట్టింది. అయితే వీరి బెయిల్ కోసం పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఖతార్ కోర్టు.. ఈ ఎనిమిది మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసులో చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తామని పేర్కొంది.

ఉరిశిక్ష పడ్డ ఎనిమిది మంది మాజీ నావికాదళ అధికారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఇంతకు వాళ్లెవరంటే.. కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్ పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్,కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, సెయిలర్ రాగేష్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల స్వస్థలం విశాఖ. అతడికి ఉరి శిక్ష పడిందని తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సుగుణాకర్ విశాఖ పట్నం టింపనీ స్కూల్‌లో, అనంతరం విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. అనంతరం నేవల్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యనభ్యసించి.. నేవీలో చేరారు. విశాఖలోని తూర్పు నౌకాదళంలో పని చేసిన ఆయన.. పలు హోదాల్లో విధులు నిర్వహించారు.

పదవీ విరమణ అనంతరం ఓ కంపెనీ తరుఫున పనిచేసేందుకు ఖతార్ వెళ్లగా.. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ఇప్పుడు వీరంతా దోహ జైలులో ఉన్నారు. కాగా, అతడికి ఉరి శిక్ష పడటంతో తమకు న్యాయం చేయాలంటూ బీజెపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును కలిశారు అతడి కుటుంబ సభ్యులు . అసలు వీరిపై అభియోగాలకు కారణం ఏంటంటే.. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ కంపెనీ రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ స్వ్కాడ్రన్ లీడర్ ఖమీస్ అల్-అజ్మీకి చెందినది. ఓ ముఖ్యమైన ప్రాజెక్టులో భాగంగా.. ఈ ఎనిమిది మంది నావికాదళానికి చెందిన మాజీ ఉన్నతోద్యోగులను నియమించుకుంది సదరు సంస్థ.

వీరంతా కూడా గతంలో 20 సంవత్సరాల వరకు నేవీలో విశేష సేవలందించిన వారే. పురస్కారాలు తీసుకున్నవారు ఉన్నారు. గత ఏడాది గూఢచర్యం ఆరోపణలపై అజ్మీతో సహా వీరందరినీ అరెస్టు చేయగా.. నవంబర్ లో సంస్థ యజమాని విడుదలయ్యాడు. అప్పటి నుండి మిగిలిన 8 మంది ఖతార్ నిర్బంధంలోనే ఉన్నారు. అలాగే సదరు సంస్థ దహ్రా గ్లోబల్ కార్యకలాపాలనను ఈ మేలో మూసివేయడంతో.. అక్కడ పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి వచ్చేశారు. ఆ ఎనిమిది మందికి మరణ శిక్ష విధించడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇంతకాలం వివరణాత్మక తీర్పు కోసం ఎదురు చూశామని, ఈ తీర్పు దిగ్భ్రాంతికి కలిగించిందని పేర్కొంది. తాము బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో చర్చిస్తామని, అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తామని పేర్కొంది. వారికి కాన్సులర్, చట్టపరమైన సాయాన్ని అందిస్తామని తెలిపింది.