iDreamPost
iDreamPost
రాయలసీమలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అదేమిటో ఒకరు మాట్లాడిందే మరొకరు మాట్లాడి జనాలను కన్ఫ్యూజ్ చేసేయడం ఇప్పుడు అలవాటైపోయింది కొందరు నేతలకు.
అభివృద్ధి చెయ్యండి.. లేదంటే చేసే వారిని ప్రోత్సహించండి.. లేదంటే ఎవరి పని వారు చూసుకోండి అని చాలాచోట్ల అందరూ చెబుతుంటారు. అయితే సరిగ్గా ఇప్పుడు ఇదే మంత్రం రాయలసీమ నేతలకు సెట్ అవుతోంది. అభివృద్ధి చేస్తుంటే సపోర్ట్ చెయ్యాల్సింది పోయి అభివృద్దికి ఆటంకాలు కలిగించేలా మాట్లాడటం ఇప్పుడు అలవాటైపోయింది. మొన్న మూడు రాజధానుల ప్రకటన విషయంలో రాయలసీమ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశం స్వాగతిస్తూనే పలు డిమాండ్లు తీసుకొచ్చారు. డిమాండ్లు ఏవైనప్పటికీ నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తెరపైకి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఏం ఆశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో తెలియడం లేదు. సీనియర్ నాయకులు అయ్యుండి ఇలా మాట్లాడటం కేవలం ప్రజలను కన్‌ఫ్యూజ్ చెయ్యడం కోసమేనని అనిపిస్తోంది.
ఇప్పుడు మరో సీమ నేత జేసీ దివాకర్ రెడ్డి కొత్తపలుకులు తీస్తున్నారు. హైకోర్టు వల్ల రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. దీంతో పాటు ప్రతి జిల్లాలో కియా పరిశ్రమలాంటిది ఒకటి పెడితే బాగుంటుందని చెప్పారు. ఇక్కడే జేసి స్థాయి నేతలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే కేవలం 8 దేశాల్లో మాత్రమే కంపెనీలు ఉన్న కియా పరిశ్రమ మన ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌కు రావడం సంతోషించదగ్గ విషయం. అయితే ఇదే సమయంలో ప్రజలను పక్కదారి పట్టించేందుకు కియా లాంటివి జిల్లాకు ఒకటి కావాలని జేసీ చెప్పడం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే అవుతుంది. ఇక ప్రత్యేక రాయలసీమ నినాదం జేసీ కూడా తెరపైకి తెచ్చారు. రెండేళ్లకో, పదేళ్లకో ప్రత్యేక రాయలసీమ వచ్చి తీరుతుందని ఆయన వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉంది. మొన్న టీజీ వెంకటేష్, నేడు జేసి ఇలా కొత్త పలుకులు పలకడమేంటో వారికే తెలియాలి.