తెలుగు హీరోలు – కోటీశ్వరుడి ఫార్ములా – Nostalgia

  • Published - 08:12 AM, Thu - 19 December 19
తెలుగు హీరోలు – కోటీశ్వరుడి ఫార్ములా – Nostalgia

తెలుగు సినిమాల్లో హీరోలకు ఒక ఫార్ములా ఉంటుంది.ఒకప్పుడు హీరోలను పేద వ్యక్తిగా, మధ్య తరగతి యువకుడిగా దర్శకులు చూపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కదా అందుకే హీరోలను కొన్ని లక్షల కోట్లకు వారసుడిలా చూపిస్తూ, కలెక్షన్స్ దండుకోవాలని ప్లాన్ చేస్తున్నారు..అయితే కోటీశ్వరులుగా ఉన్న హీరోలు సినిమా కథల్లో రెండు రకాలుగా ఉంటారు. చిన్నస్థాయి నుండి కోటీశ్వరుడిగా, శాసించే వాడిగా ఎదగడం,లేదా వారసత్వంగా కోటీశ్వరులు కావడం..

చిన్న స్టేజ్ నుండి అంచెలంచెలుగా ఎదిగి కోటీశ్వరుడు అవ్వడం ఆధిపత్యం చలాయించడం మొదటి కేటగిరీలోకి వస్తుంది. ఈ కేటగిరీలో హీరో మొదట పేద యువకుడిగా ఉంటాడు. విలన్ తో పందెం కట్టడం వల్లనో లేదా కుటుంబ తగాదాల వల్లనో, విలన్ పై ప్రతీకారం తీర్చుకోవడం కోసమో చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదుగుతారు..

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది, ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి చేసిన పాత్ర.. 5 సంవత్సరాల్లో, 50 లక్షలు సంపాదిస్తాను అని రావు గోపాలరావుతో పందెం వేసి మరీ, ప్రేక్షకుల మనసులతో పాటు డబ్బు కూడా సంపాదించాడు.

మణిరత్నం నాయకుడు మూవీలో కమల్ హాసన్ అత్యంత సాధారణ స్థితి నుండి ముంబైని శాసించే స్థితికి చేరుకుంటాడు. ఈ సినిమా అవార్డులు రివార్డులు కొల్లగొడుతూ దేశంలో తీసిన ఉత్తమ సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత నరసింహ,ముత్తు, అరుణాచలం సినిమాల్లో రజనీ కాంత్ చేసిన పాత్రలు గురించి చెప్పుకోవాలి. అరుణాచలం సినిమాలో ముందు చిన్న స్థాయి వ్యక్తిగా అనాధగా ఉండి తానొక కోటీశ్వరుడి కొడుకునని తెలుసుకుని అమాంతం కోటీశ్వరుడిగా రజనీకాంత్ మారిపోతాడు.ముత్తులో కూడా ఒక పనివాడు ఆస్తి మొత్తానికి వారసుడన్న మాట. నరసింహాలో కూడా గ్రానైట్ కొండను తవ్వి ఒక్క పాటలో కోటీశ్వరుడు అయిపోతాడు.

సూర్యవంశం సినిమాలో వెంకటేష్ ఒక ప్రైవేట్ బస్సు నడుపుతూ ఒక్క పాటలో కోటీశ్వరుడు అవుతాడు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజమౌళి హీరోలు ఒక ఎత్తు.. పైనున్న హీరోలు కష్టపడి పనిచేసో,వారసత్వ కారణంగా కోటీశ్వరులు అయితే, రాజమౌళి హీరోలు మాత్రం ఒక్క ఫైట్ తో అధికారం చేజిక్కుంచుకుంటారు. ఛత్రపతి,సింహాద్రి సినిమాల్లో సామాన్యులుగా ఉన్న హీరోలు ఒక్క ఫైట్ తో ప్రజలందరికీ ఆశాదీపంగా మారతారు..దానితో పాటు డబ్బు కూడా సంపాదిస్తారు.

కోటీశ్వరులు కాస్తా స్క్రీన్ ప్లే లో ఉన్న చిన్న చిన్న ముడుల వల్ల సాధారణ స్థాయికి మారాల్సి రావడం ఈ కేటగిరీలోకి వస్తుంది. కథలో భాగంగా సామాన్యుల ఇంటికి కోటీశ్వరుడైన హీరో రావడం, అప్పటివరకూ హీరోలకు తెలియని చిన్న చిన్న ఆనందాలు, బంధాలలోని విలువలు కొత్తగా తెలుసుకుంటుంటే ప్రేక్షకులు భలే ఆనందిస్తారు. కొన్ని సినిమాల్లో సామాన్యుల కష్టాలను హీరోలు తెలుసుకుని వారి కష్టాలను తీరుస్తూ వారిలో ఒకరిగా కలిసిపోతాడు. పిల్ల జమిందార్, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది,గౌతమ్ నందా,పంతం,బిచ్చగాడు,డిక్టేటర్ లాంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. కోటీశ్వరులైన హీరోలు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి కష్టాలు పడుతుంటే ప్రేక్షకులు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు. పిల్ల జమిందార్ లో ఆ తరహా హాస్యం అధికం..

కానీ తల్లిని కాపాడుకోవడానికి కోటీశ్వరుడైన హీరో బిచ్చగాడిగా మారి ముష్టి ఎత్తిన సినిమాలో తల్లికోసం హీరో పడుతున్న కష్టాలను చూసి కనీ వినీ ఎరుగని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు.

అత్తను ఇంటికి తీసుకురావడానికి డ్రైవర్ గా అవతారం ఎత్తిన గౌతమ్ నందాగా పవన్ కళ్యాణ్ ను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. విడుదలకి ముందుగా అంతర్జాలంలో సినిమా పైరసీకి గురైనా సరే సినిమా విజయం ఆగలేదు.

డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆస్తి మొత్తం దక్కుతుందనే ముడితో నాని పిల్ల జమీందార్ లో నవ్వుల పువ్వులు పూయించాడు. అహంకార స్థితినుండి మానవీయ విలువలను నేర్చుకునే యువకుడిగా నాని నటన అద్భుతంగా సాగుతుంది.

గ్రామాల దత్తత అనే కొత్త కాన్సెప్టుతో రూపొందిన శ్రీమంతుడు సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కోటీశ్వరుడైనా సరే అసంతృప్తితో బాధపడే యువకుడిగా మహేష్ నటన కాసుల వర్షం కురిపించింది. అనేకమంది నాయకులు ఈ సినిమా చుసిన తర్వాత కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావడం గమనార్హం.

గోపీచంద్ కూడా గౌతమ్ నందా, పంతం సినిమాల్లో కోటీశ్వరుడిగా దర్శనమిచ్చారు. బాలకృష్ణ కూడా డిక్టేటర్ సినిమాలో వేల కోట్ల అధిపతిగా కనిపించారు.

గతంలో హీరోలు చిల్లర దొంగతనాలు చేసే చిన్న చిన్న దొంగలుగా,రౌడీయిజం చేసే రౌడీలుగా, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులుగా ఎక్కువగా కనిపించేవారు. తరువాత కుటుంబ బాధ్యతలు మోసే యువకుడిగా కొంతకాలం కనిపించారు . 2000 సంవత్సరానికి వచ్చేసరికి ఆవారాగా తిరిగే జులాయిగా కనిపించడం మొదలుపెట్టారు. ఇప్పుడేమో ఎక్కువశాతం కోటేశ్వరుడిగా కనిపిస్తున్నారు. మళ్ళీ మధ్యతరగతి యువకుల మనస్తత్వాలను ప్రతిబింబించే,కుటుంబ బాధ్యతలు మోసే యువకుల పాత్రల్లో హీరోలు ఎప్పటికి కనిపిస్తారో అని ప్రేక్షకుల వెతుకులాటలు మొదలయ్యాయి. దర్శకులు కూడా అలాంటి సినిమాలను తీస్తే బాగుంటుందేమో…

Show comments