iDreamPost
android-app
ios-app

మీ పేరుతో ఎన్ని ఫోన్‌ నంబర్లు ఉన్నాయి..?

మీ పేరుతో ఎన్ని ఫోన్‌ నంబర్లు ఉన్నాయి..?

మన దేశంలో ఒక వ్యక్తి ఎన్ని ఫోన్‌ నంబర్లు అయినా కలిగిఉండొచ్చు. ఎలాంటి పరిమితి లేదు. గతంలో గుర్తింపు కార్డు, ఫొటో తీసుకుని సర్వీస్‌ ప్రొవైడ్‌ కంపెనీలు నంబర్లు ఇచ్చేవి. ఇప్పుడు ఆధార్‌కార్డు తీసుకెళితే చాలు. మనం వాడి ప్రస్తుతం మరుగునపడిపోయిన ఫోన్‌ నంబర్లు కొన్ని అయితే.. మనం ఇచ్చిన పత్రాలతో సిమ్‌లు తీసుకుని వాడే వారు మరికొందరు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సిమ్‌లు రెండు. వేర్వేరు కంపెనీలకు చెందిన రెండు నంబర్లు వాడుతుంటాం.

మనం ప్రస్తుతం వాడే నంబర్లు సరే.. కానీ గతంలో మనం వాడి పడేసిన నంబర్ల పరిస్థితి ఏమిటి..? అవి ఉన్నాయా..? లేవా..? అసలు మన పేరుపై ఎన్ని నంబర్లు ఉన్నాయి..? అనే విషయం ఇప్పుడు తెలుసుకోవచ్చు. తెలుసుకోవడమే కాదు.. మనం వాడని నంబర్లను రద్దు చేసుకోవచ్చు. టెలికం శాఖ ఇందు కోసం ఓ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను రూపొందించింది. విజయవాడ టెలికం విభాగం రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. htpp://tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్‌ నంబర్‌ను నమోదు చేస్తే.. ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే.. మన పేరుపై ఎన్ని నంబర్లు ఉన్నాయో కనిపిస్తుంది.

ఇలా మన పేరుపై ఉన్న నంబర్లను తెలుసుకోవడమే కాదు.. అందులో వాడుకలో లేని నంబర్లను వెబ్‌సైట్‌ ద్వారానే తొలగించవచ్చు. స్క్రీన్‌పై కనిపించే నంబర్లలో వాడుకలోలేని నంబర్లను సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ కొడితే చాలు.. టెలికం విభాగం రద్దుకు సంబంధించిన చర్యలు తీసుకుంటుంది. గతంలో మనం ఉపయోగించి వదిలేసిన నంబర్లతోపాటు మన పేరుతో ఇతరులు నంబర్లు తీసుకుని ఉంటే.. వాటిని తొలగించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. htpp://tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లోకి వెళదాం.