Idream media
Idream media
గ్రేటర్ ఎన్నికల పోరు ప్రచార ఘట్టం ముగింపు మహా సంగ్రామాన్ని తలపించేలా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల నుంచి హేమాహేమీలు రంగంలోకి దిగనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలలో పాల్గొని ప్రచార పర్వాన్ని రక్తికట్టించనున్నారు. బీజేపీ నుంచి 27న జేపీ నడ్డా, 28న యూపీ సీఎం ఆదిత్యనాథ్, 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. వీరంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే రోడ్ షోలు, ర్యాలీలలో పాల్గొననున్నారు.
కేసీఆర్ సమాధానాలపై సర్వత్రా ఆసక్తి
ఇదంతా ఒక ఎత్తయితే ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో జరిగే టీఆర్‌ఎస్ సభ గ్రేటర్ ఎన్నికల మొత్తం ప్రచారంలోనే టాప్‌గా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ కానుండడం, కొంత కాలంగా బీజేపీ నేతలు టీఆర్‌ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గట్టిగా బదులిస్తారన్న అంచనాల మధ్య శనివారం ఈ సభ జరగనుంది. ఇప్పటికే కేసీఆర్ ఈ మేరకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్‌లో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ఆరోపణలను, ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడినప్పటికీ కేవలం తాము చేయబోయే అభివృద్ధి అంశాలకే ఎక్కువగా కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతిపక్షాల విమర్శలపై పెద్దగా స్పందించ లేదు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటుండడంతో ఆయన మాటలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. 150 వార్డులు గల గ్రేటర్‌పై పాగా వేసేందుకు హోరాహోరీగా సాగుతున్న పోరు నేపథ్యంలో ఆ దిశగానే కేసీఆర్ ప్రధానంగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలు ఉన్నాయి.
భారీ ఏర్పాట్లు
ఎల్బీస్టేడియంలో జరిగే ఈ సభను టీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది. భారీ సంఖ్యలో జన సమీకరణ చేయనుంది. ప్రతి డివిజన్ నుంచి సభకు 3500 మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. స్టేడియంలో ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బలమల్లు తదితరులు పరిశీలిస్తున్నారు. సభ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. బందోబస్తుతో పాటు ట్రాఫిక్‌కు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.