Idream media
Idream media
హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ ఓడిపోయింది. వరద సాయం పంపిణీలో గందరగోళాలు తలెత్తాయి. ధర్నాలు, ఆందోళనలతో మహా నగరం అట్టుడికింది. ఇవన్నీప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతాయని, ఈ ప్రభావం జీహెచ్ ఎంసీ ఎన్నికలపై ఉంటుందని, ఈ నేపథ్యంలో ఎన్నికలను ఇప్పట్లో జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండదని అత్యధిక మంది భావించారు. రాజకీయ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరిగింది. కానీ సీఎం కేసీఆర్ ఇవేమీ లెక్క చేయలేదు. ఎన్నికల విషయంలో ముందుకే వెళ్లినట్లు తేలిపోయింది. టీఆర్ఎస్ పై ప్రజలకు ఆదరణ తగ్గలేదని నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు ముందే దీనికి సంబంధించి సంకేతాలు కూడా ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక తమకు లెక్కే కాదని, ఓడినా గెలిచినా పట్టింపు లేదని తెలిపారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కూడా జీహెచ్ ఎంసీ ఎన్నికలపై చర్చించారు. సిద్ధంగా ఉండాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, శ్రేణులకు సూచించారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని కూడా చెప్పారు.
షెడ్యూల్ విడుదలతో వ్యూహాలకు పదును
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానంగా ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఒక వైపు దుబ్బాక లో పరాజయం పాలవడంతో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభావం తగ్గుతుందన్న ప్రచారం ప్రారంభమైంది. అదేమీ లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు కొట్టి పారేస్తున్నా అంతర్గతంగా దీనిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ గ్రేటర్ పార్టీకి తగిన సూచనలు చేశారు. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిపారు. దుబ్బాక ఉప ఎన్నికకు ముందే గ్రేటర్ ఎన్నికలపై సర్వే నిర్వహించామని, టీఆర్ఎస్ 94 స్థానాలు సాధిస్తుందని ప్రకటించారు. ఈసారి బీజేపీకి ఒకటో రెండో సీట్లు పెరగొచ్చని స్వయం గా కేసీఆరే ప్రకటించారు. అయితే దుబ్బాక ఫలితాల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో మరోసారి సర్వే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ సారథ్యంలో…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకు గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించారు. అంతకన్నా ముందే కేటీఆర్ ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. ప్రధానంగా వరద పంపిణీ సాయం అందించే సమయంలోనూ ఆయనే స్వయంగా ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆ సందర్భంగానే స్థానికంగా పోటీ చేయబోయే కొంత మంతి కార్పొరేటర్ అభ్యర్థులను కూడా ముందే ప్రజలకు పరిచయం చేసి, ఏం అవసరాలున్నా వీరిని సంప్రదిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని తెలిపారు. అటు బాధితులకు సాయం అందిస్తూ.. మరోవైపు పార్టీపరంగా కూడా ప్రయోజనం ఉండేలా ద్విముఖ వ్యూహం అనుసరించారు. అలాగే రెండు నెలల క్రితం కార్పొరేటర్లతో జరిగిన సమావేశం లో కొంత మందికి హెచ్చరికలు జారీ చేశారు. పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్ ఉండబోదని తెలిపారు. ఇవన్నీ గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ ముందస్తుగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయనకే బాధ్యతలు అప్పగించినట్లు కేసీఆర్ ప్రకటించడంతో మరింత సీరియస్ గా ప్రణాళికలు అమలు చేసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.