Venkateswarlu
Venkateswarlu
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డం బాగా తగ్గింది. కొన్ని జిల్లాల్లో.. అక్కడక్కడా చెదురు మొదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే, ఎండలు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. రెండు రోజులనుంచి వర్షాలు అసలే పడటం లేదు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించింది. 25 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 28నుంచి సెప్టెంబర్ 2 మధ్య విరామం తర్వాత సెప్టెంబర్ 3 నుంచి మళ్లీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరి, మరో మూడు రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షలు అన్న వాతావరణ శాఖ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.