iDreamPost
android-app
ios-app

NTR, Chandrababu, Yanamala – యనమల చెబుతున్నారు నమ్మండి.. జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారట..!

  • Published Nov 11, 2021 | 12:46 PM Updated Updated Nov 11, 2021 | 12:46 PM
NTR, Chandrababu,  Yanamala – యనమల చెబుతున్నారు నమ్మండి.. జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారట..!

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడం వల్ల.. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వింత వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. 39 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని గొప్పగా చెప్పుకున్న ఆయన పొంతన లేని మాటలను, అవాస్తవాలను వల్లె వేశారు. ఇదేనా ఈయనగారి అనుభవం అని జనం పెదవి విరిచేలా ఆయన వ్యాఖ్యలు సాగాయి.

వ్యవస్థలను ఎవరు భ్రష్టు పట్టించారు..?

1995లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్లో కీలకపాత్ర పోషించిన యనమల రాష్ట్రంలో వ్యవస్థలు భ్రష్టు పట్టడానికి మూల కారకులు అన్న సంగతి మర్చిపోయినట్లున్నారు. 220 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ ను గద్దె దింపడానికి చంద్రబాబు రాష్ట్రంలో వ్యవస్థలను చెరబట్టినప్పుడు స్పీకరుగా ఉన్న యనమల ఎందుకు అడ్డుకోలేదు. రాజకీయ భిక్ష పెట్టి స్పీకరు స్థాయికి ఎదిగేలా యనమలను ప్రోత్సహించిన ఎన్టీఆర్.. శాసనసభలో ఒక్కసారి మాట్లాడాలని కోరితే ఆయనకు మైకు ఇవ్వడానికి సైతం నిరాకరించి, స్పీకరుగా కనీస ప్రజాస్వామ్య స్పూర్తిని చూపని యనమల వ్యవస్థల గురించి మాట్లాడడం వింతగా ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ తో గెలిచిన ఎమ్మెల్యేలను కుట్రతో చంద్రబాబునాయుడు తన వైపు తిప్పుకొని రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని పదవీచ్యుతుడిని చేస్తున్నారని తెలిసినా యనమల ఎందుకు సహకరించారో.. ఇలాంటి విమర్శలు చేసే ముందు చెబితే బాగుంటుంది. నాడు స్పీకర్ గా యనమల వ్యవహరించిన తీరు శాసన వ్యవస్థను భ్రష్టు పట్టించడం కాదని చెప్పగలరా..?

ఎవరిది నిరంకుశత్వపాలన..?

సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నిరంకుశత్వపాలన సాగిస్తున్నారని యనమల విమర్శించారు. ఆఫ్ ది వైసీపీ, ఫర్ ది వైసీపీ, బై ది వైసీపీ అన్న చందంగా పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు రాజకీయాల్లో సీనియర్ ను అని చెప్పుకొనే యనమల అందుకు తగిన ఆధారాలు చూపాలి కదా. మాట్లాడితే నిబంధనలు వల్లించే యనమల ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని సీఎం జగన్ ఖూనీ చేశారో వివరిస్తే జనం అర్థం చేసుకొనేవారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులతో కాల్పులు జరపడం, ఒక మహిళా ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి వాహనాలు మారుస్తూ రాజధాని చుట్టూ తిప్పి భయానక వాతావరణం సృష్టించడం ప్రజాస్వామ్యాన్ని బతికించడమా? మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టి ఈడ్వడం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రజాప్రతినిధులు బహిరంగంగా బెదిరించడం నిరంకుశత్వపాలన కాదా? ఇలాంటి పోకడలు పోయిన ప్రభుత్వంలో భాగస్వామి అయిన యనమల ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం విడ్డురంగా ఉంది.

Also Read : TDP, Pattabhiram Behaviour – పట్టాభిలో ఎంత మార్పు..?

ఉద్యోగులకు నరకం చూపలేదా?

ప్రభుత్వద్యోగులకు తాము 23 బెనిఫిట్స్ ఇచ్చామని, జగన్ ప్రభుత్వం ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వలేదని, జగన్ విధానాల వల్ల భవిష్యత్‌లో యువత చాలా నష్టపోతుందని యనమల ఆరోపించడం మరీ విడ్డూరంగా ఉంది. చంద్రబాబు హయాంలో ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల ఉద్యోగులకు నరకం చూపిన సంగతి మర్చిపోయినట్లున్నారు. 2004లోనూ, 2019లోనూ టిడిపి అధికారం నుంచి దిగిపోయే సందర్భంలో మూడేసి డీఏలు బకాయిలు పెట్టి పోయిన సంగతి ఉద్యోగులు ఇంకా మరచిపోలేదు. గంటల తరబడి రివ్యూ మీటింగ్ లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దుర్భాషలు ఆడుతూ వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేసి కొందరు గుండెపోటుతో మరణించడానికి కారణమైన టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు 23 బెనిఫిట్స్ ఇచ్చిందని చెబితే నమ్ముతారని అనుకుంటే యనమల పప్పులో కాలేసినట్లే. రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించకుండా ఉన్నవారిపై ఒత్తిడి పెంచడం, ఉద్యోగుల జీతాలకు, పింఛన్లకు ఎక్కువ ఖర్చవుతోందని సన్నాయి నొక్కులు నొక్కడం వంటివన్నీ కూడా యనమల చెబుతున్న 23 బెనిఫిట్స్ లో ఉన్నాయా?

జగన్ ఉద్యోగుల పక్షపాతి కాదా?

వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే దాదాపు లక్షాయాభై వేల పర్మినెంట్, రెండు లక్షల యాభై వేల వలంటీర్ పొస్టులు భర్తీ చేసి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించింది. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడం, టీడీపీ హయాంలోని మూడు డీఏ బకాయిలను చెల్లించడానికి కేలండర్ ప్రకటించి అమలు చేస్తుండడం, పీఆర్సీని అమలు చేయడానికి కసరత్తు చేయడం వారికి బెనిఫిట్స్ కల్పించడం కాదా..? కరోనా కష్టకాలంలో సైతం జాబ్ కేలండర్ అమలు చేస్తూ కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టడం యనమలకు కనిపించడం లేదేమో..?

స్థానిక లబ్ధి కోసమేనా యనమల వ్యాఖ్యలు..

ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి యనమల ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. టిడిపి యంత్రాంగం అంతా ఒక్క గెలుపు కోసం ఎంతగా పరితపించి పోతోంది అన్నది ఆ పార్టీ ప్రచార శైలే తెలియజేస్తోంది. గెలవడానికి కావలసినది ప్రజాబలం తప్ప ఎదుటి పక్షంపై బురద జల్లడం కాదన్న విషయం టీడీపీ ఎప్పటీకి తెలుసుకుంటుందో..!

Also Read : JC Prabhakar Reddy Hug, Paritala Sriram – జేసీ రాజకీయం.. ఆత్మీయమా..? అవసరమా..?