iDreamPost
iDreamPost
కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దని అధికార వైఎస్సార్‌సీపీ, ఇప్పుడే కావాలని ప్రతిపక్ష టీడీపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికలు అంటే అధికారంలో ఉన్నవారికి సాధారణంగా కొంత వెసులుబాటు ఉంటుందన్నది తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నవారు ఎన్నికలు పెట్టేయాలని అని డిమాండ్ చేయడం చూస్తుంటే టీడీపీ కత్తిమీద సాముకు రెడీ అవుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. తాము అనుకున్న మేరకు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక ఉందన్న నమ్మకంతోనే టీడీపీ ఎన్నికల వైపు అడుగులు వేసేందుకు సిద్దమవుతోందని అంచనా వేస్తున్నారు. ఇది ఒకరకంగా ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమైన ప్రయత్నమేనన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
ఏ ముహూర్తాన 2014న అధికారంలోకొచ్చారో గానీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అంచనాలు బెడిసి కొడుతున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. ఆయన తలకెత్తుకున్న అమరావతి, పోలవరం.. తదితర కార్యక్రమాలన్నీ అసంపూర్తిగానే ఉండిపోవడంతో ప్రజల్లో తనపై సాఫ్ట్‌కార్నర్‌ను కొనసాగించుకోలేకపోయారు. 2014 నాటికి చంద్రబాబుపై ఉన్న సాఫ్ట్‌కార్నర్ కాస్తా 2019 నాటికి పూర్తి వ్యతిరేకంగా మారిపోయిందని ఎన్నికల ఫలితాలే చాటిచెప్పాయి. అయితే ఆ తరువాత అయినా ప్రజల్లోకొచ్చి నిలబడి వారి తరపున మాట్లాడిన ఘటన ఒక్కటైనా ఉందా? అంటే అదీ లేదనే చెప్పాలి. కోవిడ్‌ను సాకుగా చూపి జనానికి దాదాపు దూరమైపోయారు.
ఇదిలా ఉండగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తానని ప్రకటించిన కీలక సంక్షేమ పథకాలకు మోకాలడ్డుతున్నారన్న భావన ప్రజల్లోకి బలంగానే చొచ్చుకువెళ్ళింది. ఉదాహరణకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి వాటిపై కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించింది టీడీపీ నాయకులేనన్న వాదనను అధికార వైఎస్సార్‌సీపీ బలంగానే జనంలోకి తీసుకువెళ్ళింది. ఈ విషయంపై టీడీపీ, ఇతర రాజకీయపక్షాలతో చేపట్టిన పోరాటాలకు జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. చంద్రబాబు ఊహిస్తున్నట్లు ఒక వేళ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే పెరిగితే టీడీపీ చేపట్టే ఏ చిన్న పోరాటానికైనా జనం తండోపతండాలుగానే వచ్చిపడేవారు. కానీ అటువంటి పరిస్థితి ఏపీలో కానరావడం లేదు. అంటే ఇంకా జనం చంద్రబాబు, ఆయన పార్టీ పట్ల 2019 నాటి భావనలోనే ఉన్నారని భావించాల్సి ఉంటోంది. దీనికి తోడు ప్రజలకు ఇది సమస్య అని భావించిన ఏ అంశంమీదనైనా చంద్రబాబు కేవలం ఇన్‌స్టెంట్ పోరాటలకు మాత్రమే సిద్ధపడుతున్నారు. సదరు పోరాటాన్ని కొనసాగిస్తూ ప్రజల్లోకి చొచ్చువెళ్ళే ప్రయత్నం ఆయన గానీ, కేడర్‌గానీ చేయడం లేదు.
ప్రభుత్వం వైపునుంచి వైఫల్యాల్లేవా అంటే.. ఉన్నప్పటికీ వాటిని గురించి ప్రజలు పట్టింపుగా గుర్తించడం లేదనే చెప్పాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాల అమలుతోపాటు, కోవిడ్ నియంత్రణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ప్రజల్లో ఆ పార్టీపై సానుకూల ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు వేసుకున్న అంచనాలతో ఎన్నికల కమిషన్ వేదికగా స్థానిక సంస్థల ఎన్నికల జరపాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి కత్తిమీద సాములాంటిదేనన్న అభిప్రాయం రాజకీయాలవర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.