iDreamPost
android-app
ios-app

టీడీపీ కొత్త కార్యక్రమం.. మా ఊరు – మా బడి

టీడీపీ కొత్త కార్యక్రమం.. మా ఊరు – మా బడి

నూతన విద్యా విధానంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నత పాఠశాల్లో 3,4,5 తరగతులు విలీనం చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హై స్కూల్స్ కు 250 మీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను హై స్కూల్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆదేశాలివ్వడంతో అధికారులు చర్యలు కూడా చేపట్టారు. కింది తరగతులను విలీనం చేయడంతో హైస్కూల్లో విద్యార్ధుల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఇప్పుడు ఇదేదో తప్పు అన్నట్టు ఏపీ మాజీ ఎక్సైజ్ శాఖా మంత్రి, టీడీపీ నేత జవహర్ మాట్లాడుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యార్థులను విద్యకు, స్కూళ్లను గ్రామాలకు దూరం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రాథమిక విద్యాభ్యాసానికి చంద్రబాబు అధిక ప్రాధాన్యతిచ్చారని, చంద్రబాబు హయాంలో కిలోమీటర్‌కి ఒక స్కూల్ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.

జగన్‌రెడ్డి మాత్రం 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో పెట్టాలనడం, ముమ్మాటికీ విద్యారంగాన్ని నాశనం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ ఆధ్వర్యంలో మా ఊరు-మా బడి కార్యక్రమం చేపట్టబోతున్నామని ఆయన వెల్లడించారు. కానీ గతంలో హాజరు శాతం తక్కువ ఉందని కొన్ని స్కూళ్లను, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కొన్ని స్కూళ్ళను అకారణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మూసివేసిన సంగతిని మాత్రం ఆయన మరుస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మనబడి- నాడు నేడు పథకం ద్వారా శిధిలావస్థలో ఉన్న స్కూల్లకు సైతం పూర్వవైభవం తీసుకువచ్చారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించే పరిస్థితి ఉండేది కాదు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెరగడంతో ప్రైవేట్ స్కూళ్లకు వేలకు వేలు ధార పోస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. అందరూ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ బావుంది అని మెచ్చుకుంటుంటే ఇప్పుడు పరిస్థితులు ఏమీ బాగోలేదు మేము వస్తే ఇంకేదో చేస్తాము అని ఆయన మాట్లాడటం ఖచ్చితంగా హాస్యాస్పదమే తప్ప మరొకటి కాదు. అదీకాక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు హైస్కూల్లో కలవడం వలన హై స్కూల్ విద్యార్థుల సంఖ్య పెరగడమే కాక అక్కడ ఉన్న సుశిక్షితలైన టీచర్లు ప్రాథమిక తరగతుల విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాలన్నీ మరచి మేము వస్తే ఏదో చేస్తాము అని చెప్పడం ఏంటో ఆయనకే తెలియని మరి.