iDreamPost
android-app
ios-app

మంత్రి వెల్లంపల్లిని లక్ష్యంగా చేసుకున్నారా..?

మంత్రి వెల్లంపల్లిని లక్ష్యంగా చేసుకున్నారా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా చేసుకుందా..? అంటే ఇటీవల జరిగిన పరిణామాలు ద్వారా అవుననే సమాధానం వస్తోంది. దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు గతంలో డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ ఓ రకంగా సహేతుకమైంది. అయితే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయంగా పేరొందిన విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే అవాంఛనీయ ఘటనలను కూడా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ముడిపెడుతూ టీడీపీ రాజకీయం చేస్తుండడం హాస్యాస్పదంగా మారింది.

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో దుర్గమ్మ రథంలోని నాలుగు వెండి సింహాల్లో మూడు చోరీకి గురయ్యాయి. ఈ విగ్రహాలు దొంగిలింపజేసింది మంత్రి శ్రీనివాసరావే అంటూ టీడీపీ నేతలు జుగుస్పారకమైన విమర్శలు చేశారు. పోలీసులు విచారణ చేస్తూ, దొంగలను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా.. వారి విచారణ పూర్తి కాకముందే.. విగ్రహాలు మంత్రి వెల్లంపల్లి ఇంట్లో ఉన్నాయంటూ టీడీపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేశారు. మొత్తం మీద పోలీసులు ఈ కేసును ఛేధించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు కనిపెట్టారు. వాటిని కొన్న వ్యాపారిని, దొంగను అరెస్ట్‌ చేశారు. అప్పటి వరకు మంత్రి వెల్లంపల్లిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. పోలీసులు దొంగను అరెస్ట్‌ చేసి, సొత్తును రికవరీ చేయడంతో మౌనం దాల్చారు. అసలు ఈ ఘటన ఒకటి జరిగిందీ. దాని పై తాము రాద్ధాంతం చేశామనే విషయాన్ని మరచిపోయినట్లుగా తేలుకుట్టినదొంగల్లా మిన్నుకుండిపోయారు.

తాజాగా దుర్గమ్మ సన్నిధితో అవినీతి, అవకతవకలు జరిగాయని ఏసీబీ తేల్చడంలో 15 మంది సిబ్బందిపై వేటు పడింది. టిక్కెట్లు, ప్రసాదం విక్రయం అమ్మవారి చీరల విక్రయం, అన్నదానం కోసం నిత్యవసర సరుకులు కొనుగోలు.. ఇలా ఏడు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ఏసీబీ తన విచారణలో తేల్చింది. ఏబీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే.. ఈ అవినీతికి ప్రధాన కారణం మంత్రి వెల్లంపల్లి అంటూ టీడీపీ నేతలు కేశినేని నాని, వర్ల రామయ్యలు పాతపాట పాడుతున్నారు.

దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు ప్రభుత్వంలో క్షుద్రపూజలు జరిగాయని తేలింది. సీసీ టీవీ కెమెరాల్లోనూ దృష్యాలు రికార్డు అయ్యాయి. అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే బాధ్యులు ఎవరనేది తేల్చలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో.. జనసేనకు చెందిన ఓ నేత దుర్గ గుడిలో అవినీతి జరుగుతోందంటూ ఫిర్యాదులు చేస్తే జగన్‌ సర్కార్‌ స్పందించింది. ఏసీబీ చేత విచారణ చేయించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఎవరినీ వెనుకేసుకురాలేదన్న విషయం రాష్ట్ర ప్రజలు గుర్తించారు. అయితే నిజానిజాలతో సంబంధం లేకుండా ఘటన జరిగిన సమయంలో ఆరోపణలు చేయడం, అది తేలిన తర్వాత మిన్నుకుండిపోవడం టీడీపీ నేతలకు సర్వసాధారణంగా మారిపోయింది. ఈ తరహా ప్రవర్తవన, ఆరోపణల వల్ల తాము విశ్వసనీయత కోల్పోతున్నామనే స్పృహను టీడీపీ నేతలు కోల్పోతుండడం గమనార్హం.