iDreamPost
android-app
ios-app

బాబు ప్ర‌తిప‌క్ష హోదాకి ముప్పు త‌ప్ప‌దా..!

  • Published Dec 04, 2019 | 3:54 AM Updated Updated Dec 04, 2019 | 3:54 AM
బాబు ప్ర‌తిప‌క్ష హోదాకి ముప్పు త‌ప్ప‌దా..!

అసెంబ్లీ స‌మావేశాల‌కు స‌మ‌యం ముంచుకొస్తున్న వేళ రాజ‌కీయ ప‌రిణామాల్లో ప‌లుమార్పులు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. విప‌క్ష తెలుగుదేశం పార్టీకి పెద్ద త‌ల‌నొప్పి త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌మాద నివార‌ణ‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకి ప‌రిస్థితులు స‌హ‌క‌రిస్తాయా లేదా అన్న‌ది సందేహంగా మారింది. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రి, 10 ఏళ్ల‌కు పైగా ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడిన‌ని చెప్పుకునే ఆయ‌న‌కు ఇప్ప‌టికే సీఎం హోదా చేజారిపోగా, తాజాగా ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌వికి ముప్పు త‌ప్ప‌ద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం కార‌ణంగా కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమితం కావ‌డంతో చంద్ర‌బాబుకి చిక్కులు వ‌స్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా సాధించాలంటే 10శాతం సీట్లు అన‌గా 18మంది ఎమ్మెల్యేల మ‌ద్ధ‌తు అవ‌స‌రం. ప్ర‌స్తుతం టీడీపీ త‌రుపున గెలిచిన వారిలో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ గుడ్ బై చెప్పేశారు. ఆయ‌న టీడీపీ క్యాంపుకి దూరం అయిన త‌రుణంలో వైసీపీ కండువా క‌ప్పుకుంటారా లేక సొంతంగా ప్ర‌త్యేక గ్రూపుగా మార‌తారా అన్న‌దే తేలాల్సి ఉంది. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా ఇప్ప‌టికే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయ‌న అటు బీజేపీ, ఇటు వైసీపీతో ఏక‌కాలంలో మంత‌నాలు జ‌రుపుతున్నారు. చివ‌ర‌కు ఎటు మ‌ళ్లుతారన్న‌ది స‌స్ఫెన్స్ కాగా, చంద్ర‌బాబుకి మాత్రం హ్యాండిచ్చిన‌ట్టేన‌ని అంతా భావిస్తున్నారు.

Also Read : నేవీ డే – ఘాజీ

దాంతో టీడీపీ బ‌లం 21గా అంచ‌నా వేస్తున్నారు. మ‌రో న‌లుగురు దూర‌మ‌యితే మాత్రం చంద్ర‌బాబు సీటుకి ఎస‌రు వ‌చ్చిన‌ట్టేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అందుకు అనుగుణంగానే ప‌లువురు ఎమ్మెల్యేలు ప‌క్క‌చూపులు చూస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కూడా టీడీపీ ని వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్టు చాలాకాలంగా ప్ర‌చారం సాగుతోంది. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌దే తేలాల్సిన విష‌యం. వారితోపాటుగా కొండెపి ఎమ్మెల్యేగా గెలిచిన డోలా బాలవీరాంజ‌నేయ‌స్వామి కూడా సైకిల్ దిగేందుకు సంసిద్ధుల‌వుతున్న‌ట్టు చెబుతున్నారు. ఈ ముగ్గురితో పాటుగా ఇచ్ఛాపురం, విశాఖ వెస్ట్, సౌత్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్ర‌బ‌లంగా వినిపిస్తున్నాయి.

Also Read: సుజ‌నా చౌద‌రి చేత‌ల్లోకి టీవీ చానెల్

ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని ఆశిస్తున్న బీజేపీ కూడా కొంద‌రు నేత‌ల‌కు గాలం వేస్తోంది. ఆ జాబితాలో కూడా కొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో ఇలాంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందుగానే త‌మ నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. అదే జ‌రిగితే రాజ‌కీయాల్లో పెను మార్పులు త‌ప్ప‌వ‌ని చెప్ప‌వ‌చ్చు. తెలుగుదేశం పార్టీ సంఖ్య రీత్యా ఇప్ప‌టికే స‌భ‌లో స‌త‌మ‌తం అవుతుండ‌గా, సభ్యులు వీడిపోతే మ‌రింత ఇక్క‌ట్లు ఆపార్టీకి త‌ప్ప‌వు. దాంతో ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గించే ప‌నిలో స్వ‌యంగా బాబు దిగిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌స్తోంద‌ని, జ‌గ‌న్ కేసుల్లో త్వ‌ర‌లో సంచ‌ల‌న తీర్పులు వ‌స్తాయని, జ‌మిలీ ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని చెబుతూ టీడీపీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే య‌త్నాల్లో ఉన్న పార్టీ అధినేత‌కు ఎలాంటి ఫ‌లితాలు ద‌క్కుతాయి, స‌భ‌లో ఆయ‌న ప‌రిస్థితి ఎలా మారుతుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.