సస్పెన్స్‌కు తెర : అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ.. చరిత్ర సృష్టించబోతున్న చంద్రబాబు

వివిధ కేసుల్లో టీడీపీ నేతల అరెస్ట్‌ల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు టీడీపీ హాజరుకావడంపై రాత్రి నుంచి నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. తీవ్ర తర్జన భర్జనల నడుమ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీపీ నిర్ణయించింది. దాదాపు నాలుగు గంటలపాటు పార్టీ నేతలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు.

పలువురు ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరిద్దామని చెప్పగా.. మరికొందరు హారవుదామని తమ అభిప్రాయాలు చెప్పారు. తుది నిర్ణయం పార్టీ అధినేతకు వదిలేశారు. తర్జన భర్జనల నడుము చివరకు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరుకావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సభ జరిగినన్ని రోజులు తమ పార్టీ సభ్యులు నల్ల చొక్కాలతో హాజరు కావాలని సూచించారు.

సభకు నల్ల చొక్కాలతో హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. మరో రికార్డు సృష్టించబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెండు సార్లూ నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరైన చరిత్రను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోనున్నారు. విభజన తర్వాత బీజేపీతో పొత్తు, ప్రత్యేక హోదా 15 ఏళ్లు తెస్తామని, రైతు, డ్వాక్రా రుణమాఫీ తదితర హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దాదాపు నాలుగేళ్ల పాటు బీజేపీతో పొత్తులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ తమ పార్టీ ఎంపీలు ఇద్దరికి మంత్రిపదవులు దక్కించుకున్నారు. కానీ ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలన్న మాటను పక్కనపెట్టేశారు.

అదే సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, యువభేరీలు నిర్వహిస్తూ ప్రత్యేక హోదా కోసం పోరాడారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, అదేమన్నా సంజీవనా.. అంటూ ప్రతిపక్ష పార్టీ పోరాటాలపై ఉక్కుపాధం మోపేందుకు చంద్రబాబు యత్నించారు. అయితే ఎన్నికలకు ఏడాది ఉందనగా.. బీజేపీతో ఉంటే నష్టమని భావించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగారు.

ఆ తర్వాత నల్లచొక్కాలు ధరించి ధర్మపోరాట దీక్షలతో హడావుడి చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ అదే నల్లచొక్కాలతో అసెంబ్లీకి హాజరై నాటకం మరింత రక్తికట్టించారు. ఎంత చేసినా.. 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ.. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ నల్లచొక్కాలతో అసెంబ్లీకి హాజరుకాబోతున్నారు.

Show comments