iDreamPost
android-app
ios-app

చిక్కుల్లో పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు

  • Published Dec 03, 2020 | 10:51 AM Updated Updated Dec 03, 2020 | 10:51 AM
చిక్కుల్లో పాలకొల్లు ఎమ్మెల్యే  రామానాయుడు

వైఎస్సార్సీపీ నేతల మధ్య విబేధాల మూలంగా మొన్నటి ఎన్నికల్లో గట్టెక్కిన పాలకొల్లు ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఆయనకు ఏకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసేందుకు స్పీకర్ అంగీకారం తెలపడంతో ఆసక్తిగా మారుతోంది. వరుసగా సభా సమావేశాల్లో ఇష్టారాజ్యంగా చేస్తున్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన పదవికే గండం తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

అసెంబ్లీ వేదికగా సభ్యులు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు ఏమయినా నిబందనలకు లోబడి ఉండాలి. దానికి విరుద్దంగా ప్రభుత్వంపై నోరు పారేసుకున్నా, ఎవరినైనా దూషించినా అది పెను సమస్యలకు దారితీస్తుంది. గతంలో కూడా అనేక అనుభవాలున్నాయి. అయినప్పటికీ టీడీపీ తరుపున రెండోసారి గెలిచిన నిమ్మల రామానాయుడు వాటిని విస్మరించి అడ్డగోలుగా వ్యవహరించారనే అభియోగం నమోదయ్యింది. సభలో ఆయన ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలన్నీ వాస్తవానికి పొంతనలేకపోవడం, సభా నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ప్రివిలైజ్ నోటీసు జారీకి రంగం సిద్దహయ్యింది.

ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదారి పట్టిస్తున్నారనే విమర్శలతో ఆయనపై చర్యకు సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. నేరుగా సీఎం జగన్ ఈ మేరకు తీర్మానం ప్రతిపాదించడం విశేషంగా కనిపిస్తోంది. వాస్తవానికి సభ ప్రారంభమయిన తొలి రోజు నుంచి ప్రతీ రోజూ అందరికన్నా మొదట సస్ఫెండ్ అవుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడే. ఆయనే స్వయంగా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పలు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. సభలో ఇతర సభ్యులెవరూ వ్యవహరించని రీతిలో ఆయన తీరు ఉంటుందని చివరకు టీడీపీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సహాయం, పోలవరం, టిడ్కో ఇళ్లు సహా కీలక అంశాలన్నింటా నిమ్మల రామానాయుడు చేసిన ప్రకటనలు ఉద్దేశ పూర్వంగా సభను పక్కదారి పట్టించేడమేనని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో వ్యవహారం తీవ్రమయ్యింది.

ప్రివిలైజ్ కమిటీ ద్వారా రామానాయుడుకి నోటీసు జారీ చేస్తారు. దానికి ఆయన స్వయంగా హాజరయ్యి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కమిటీ ఆయన సమాధానం పట్ల సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలు అనివార్యం అవుతాయి. చివరకు సభ నుంచి కొన్ని రోజుల పాటు సస్ఫెండ్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. దాంతో రామానాయుడు చిక్కుల్లో పడ్డట్టుగా అంతా భావిస్తున్నారు. ఆయన తీరు పట్ల విసుగు చెందిన అధికార పక్షం సీరియస్ గా వ్యవహరిస్తే రామానాయుడికి కష్టాలు తప్పవనే అభిప్రాయం ఉంది. దాంతో ఈ వ్యవహారం నుంచి ఆయన ఎలా గట్టెక్కుతారన్నది చూడాలి. అది మాత్రం నేరుగా సీఎం జగన్ చేతుల్లో ఉందనే చెప్పవచ్చు.