Idream media
Idream media
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితాలతో అధికార పార్టీ వైసీపీ పూర్తి ఆధిక్యతలో కొనసాగుతుండడం తెలుగుదేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గెలిచే అవకాశాలు లేనప్పటికీ గతం కంటే ఓ లక్ష ఎక్కువ ఓట్లు సాధించాలనే లక్ష్యంతో గతంలో పోటీ చేసిన పనబాక లక్ష్మినే టీడీపీ అభ్యర్థగా ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమని తెలిసినప్పటి నుంచే అభ్యర్థిని ప్రకటించి అందరి కంటే ముందంజలో ఉన్న టీడీపీ.. ఫలితాలలో అనుకున్నదానికంటే వెనుకంజలో ఉన్నట్లే కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 37 శాతం ఓట్లను పొందింది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో ఫలితాల సరళిని పరిశీలిస్తే 30 నుంచి 34 శాతం ఓట్ల కే టీడీపీ పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన గతంలో వచ్చిన ఓట్ల కంటే సుమారుగా ఓ లక్ష ఓట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్లమెంట్ ఫలితాలు మొత్తం 14 రౌండ్లుగా వెల్లడి కానున్నాయి. ఇప్పటి వరకూ రెండు రౌండ్ల ఫలితాల ఆధారంగా టీడీపీ పరిస్థితి దిగజారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫలితాలు వెల్లడైన ఆ రెండు రౌండ్ల ప్రాంతాలు గతంలో టీడీపీకి కంచుకోట వంటివి. గత ఎన్నికల్లో టీడీపీ తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రమే కాస్త ఎక్కువ ఓట్లు సాధించింది. ఏడు నియోజకవర్గాలకు గాను వైసీపీకి తిరుపతిలో తక్కువ సంఖ్యలో ఓట్లు అయ్యాయి. కానీ, ఉప ఎన్నిక ఫలితాలను పరిశీలిస్తే టీడీపీకి ఇప్పుడు తిరుపతిలో కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని స్పష్టమవుతోంది. తిరుపతి సెగ్మెంట్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న పనబాక ఆ పరిధిలోని కౌంటింగ్ కేంద్రానికి ముందుగా వెళ్లారు. కానీ, పరిస్థితి ఆశాజనకంగా లేదని గుర్తించిన ఆమె మూడు రౌండ్లు ముగిసేసరికే అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగారు. ఇదే పరిస్థితికి అద్దం పడుతోంది.
ఒక్కటైతే వాస్తవం… సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ సీటు పరిధిలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సాధించినన్ని ఓట్లను సాధించుకోలేకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గతంలో కన్నా పెరిగినా.. తెలుగుదేశం పార్టీ దుకాణం మూతకు రెడీ అయినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55 శాతం, టీడీపీ 37 శాతం ఓట్లను పొందాయి. తిరుపతిలో చంద్రబాబు నాయుడే ఎనిమిది రోజుల పాటు ప్రచారం చేశారు. ఇక లోకేష్ మరో పది రోజులకు పైనే ప్రచారం చేసినట్టున్నారు. ఇక చాలా కాలం కిందటే అభ్యర్థిని ప్రకటించారు. టీడీపీ ముఖ్యనేతలంతా తిరుపతిలోనే మకాం పెట్టి ప్రచారం సాగించారు. ఇక తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ వాడుకోని అంశం అంటూ ఏమీ లేదు! అన్ని అంశాలనూ వాడేశారు. ఇలాంటి నేపథ్యంలో.. ఇంతజేసీ 37 శాతం ఓట్లను అయినా పొందకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ కథ ఏపీలో ముగింపుకు చేరినట్టే, రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు ఉనికి కూడా కోల్పోవడం మొదలైనట్టే.
Also Read : తిరుపతి బై పోల్ : అధికార పార్టీ భారీ ఆధిక్యత