iDreamPost
iDreamPost
పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించే కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలం నుంచి కొనసాగిస్తున్నారు. అది ఒక పట్టాన కొలిక్కి రావడంలేదు. ఇదే అదనుగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో నేతలు ఇంఛార్జి పదవి కోసం పోటీ పడుతూ పార్టీలో వర్గాలను పెంచి పోషిస్తున్నారు. ఫలితంగా పార్టీలో ఎవరికి వారే అన్నట్లు పరిస్థితి దిగజారుతోంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇంఛార్జి పదవి కోసం ముగ్గురు నాయకులు ప్రయత్నిస్తుండగా.. వారికి అనుకూలంగా పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది.
ఎవరికి వారుగా..
నియోజకవర్గ ఇంఛార్జి పదవి కోసం మాజీమంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీచైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, పారిశ్రామికవేత్త ఆకుమర్తి రామారావు ప్రయత్నిస్తున్నారు. 2014లో ఇక్కడి నుంచి ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టిన పీతల సుజాత విస్తరణలో పదవి కోల్పోవడంతో పాటు 2019లో టికెట్ కూడా అందుకోలేకపోయారు. అప్పటి నుంచి పార్టీకి దూరమైన ఆమె.. గత ఎన్నికల్లో పోటీ చేసిన కర్రా రాజారావు మరణంతో ఖాళీ అయిన ఇంఛార్జి పదవిపై కన్నేశారు. అందుకే ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో తిరుగుతూ, ప్రెస్మీట్లతో హడావుడి చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు తాపాత్రయపడుతున్నారు. మరోవైపు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జయరాజ్ గత రెండు ఎన్నికల్లోనూ చింతలపూడి టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిద్దరికి పోటీగా జంగారెడ్డి గూడేనికి చెందిన పారిశ్రామిక వేత్త ఆకుమర్తి రామారావు తన స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు నుంచే ఆయన నారా లోకేష్ సేవా సమితి పేరుతో జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ లోకేష్ వద్ద గుర్తింపు పొందారు. ఆయన ద్వారా టికెట్ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
పార్టీని పట్టించుకునేవారేరీ?
ముగ్గురు నాయకులు ఉన్నా.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారే తప్ప నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో మాత్రం చొరవ తీసుకోవడం లేదు. తమకు అనువైన పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. వీరి ముగ్గురి మధ్య పార్టీ క్యాడర్ మూడు వర్గాలుగా విడిపోయింది. దాంతో కలిసికట్టుగా.. అధికార పార్టీకి ధీటుగా పనిచేయలేక పోతున్నామని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు. కర్రా రాజారావు ఉన్నంత వరకు పార్టీ నిర్వహణ సజావుగా సాగిందని.. ఆయన తదనంతరం దిక్కులేకుండా పోయిందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిష్టానం ఇంఛార్జి నియామకంలో విపరీత జాప్యం చేస్తూ పరిస్థితిని మరింత దిగజారుస్తోందని అసంతృప్తి చెందుతున్నారు.
Also Read : తప్పుడు ప్రచారానికి ‘ఎల్లో మీడియా’ చెల్లించక తప్పదు మూల్యం.. అండగా ఉంటానన్న బీజేపీ ఎంపీ