iDreamPost
iDreamPost
మహాభారతంలో అర్జునుడికి పిట్ట కన్ను మాత్రమే కనిపించడమంటే అది లక్ష్యం పట్ల ఉన్న చిత్తశుద్ధి. కానీ చంద్రబాబుకి మాత్రం ఏం జరిగినా జగన్ మాత్రమే కనిపించడమంటే గురి తప్పుతున్న లక్ష్యాలకు తార్కాణం. ఏం జరిగినా దానిని జగన్ కే ముడిపెట్టాలనే యత్నంలో టీడీపీ అధినేత వేస్తున్న తప్పటడుగుల పరంపరలో మరో వ్యవహారం సాగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదలను జగన్ కి ముడిపెట్టాలనే చంద్రబాబు ఉద్దేశం సామాన్యలకు సైతం ఇట్టే అర్థమవుతుంది. రోగం ఒకరికైతే మందు మరొకిరికి వేయాలనే బాబు తీరు జనాలకు ఇట్టే తెలిసోతుండడం విశేషం.
దేశమంతా పెట్రోల్ ధరలు పెరిగాయి. కేంద్రం పన్నులు పెంచి భారీగా గుంజుతోంది. ముడి చమురు ధర, శుధ్ది చేసేందుకు అయ్యే ఖర్చు, రవాణా, కేంద్రం పన్నులు, డీలర్ వాటా అన్ని కలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తాయి. ఇప్పుడు కేంద్రం పన్నులు తగ్గిస్తే అందులో వ్యాట్ శాతం అనివార్యంగా తగ్గిపోతుంది. తద్వారా సామాన్యులకు మేలు జరుగుతుంది. కానీ కేంద్రం మాత్రం అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ దేశంలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి లీటర్ పెట్రోల్ పై రూ. 9.48 పైసలు సుంకం ఉంటే దానిని ఏకంగా రూ. 32.98 పైసలకు పెంచారు. దాని మూలంగా రాష్ట్రాలు విధించే వ్యాట్ కూడా పెరిగింది. తాజాగా కేంద్రం రూ. 5 తగ్గించింది. అది కూడా రాష్ట్రాలకు ఇచ్చే వాటాలో తగ్గించింది. అంటే కేంద్రం వసూలు చేసే పెట్రోల్ ఎక్సైజ్ సుంకంలో 41 శాతం రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉండగా అందులో ఇప్పుడు తగ్గించిన దాని ప్రకారం సుమారు రూ. 2 పైబడి రాష్ట్రాల పన్నులు కూడా తగ్గినట్టే.
కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాలో కాకుండా మొత్తం రూ. 2.87లక్షల కోట్లను అదనపు సర్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తోంది. అందులో తగ్గిస్తే అందరికీ మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో మాత్రమే కాకుండా తమిళనాడు, కేరళ వంటి ప్రభుత్వాలు కూడా తేటతెల్లం చేశాయి. మేము పెంచని పన్నులను మేమెలా తగ్గిస్తామని ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రశ్నించారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనే లక్ష్యంతో గతంలో తాను చేసిన వాదనలకు తానే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ ధరల భారం కేంద్రానిదేనని, కేంద్ర ప్రభుత్వమే ధరలు నియంత్రించాలని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పిన మాటలకు భిన్నంగా ఇప్పుడు రాష్ట్రాలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తుండడం విడ్డూరంగా ఉంది.
ఏపీలో పెట్రోల్ ధరలు తగ్గించాలని టీడీపీ ధర్నాలు చేస్తుండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. నిజంగా ధరలు నియంత్రించాలనే లక్ష్యమే ఉంటే పెంచిన ప్రభుత్వం మీద దండెత్తాలి. కానీ దానికి విరుద్ధంగా జగన్ ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తూ ఆందోళనలకు పూనుకోవడం టీడీపీ తీరుని తేటతెల్లం చేస్తోంది. ఏపీ మంత్రి పేర్ని నాని సవాల్ చేసినట్టుగా ఢిల్లీలోని నార్త్ బ్లాక్ ముందు నిరసనలు తెలిపితే ప్రయోజనం ఉంటుంది. అయినా గానీ చంద్రబాబు స్థానికంగా తన రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన తనకు లేదని చాటుకుంటున్నారు. ఇన్నాళ్లుగా నిత్యం ధరలు పెంచుతున్న సమయంలో కనీసం కేంద్రాన్ని పల్లెత్తుమాట కూడా అనలేని బాబు ఇప్పుడు రోడ్డెక్కాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం విడ్డూరంగా కనిపిస్తోంది. అందుకే ఏపీ ప్రజలు బాబు అండ్ కో సాగిస్తున్న పెట్రో డ్రామాలను పసిగట్టినట్టే కనిపిస్తోంది.