iDreamPost
android-app
ios-app

TDP, Acham Naidu, YCP – అచ్చెన్నాయుడు మేకపోతు గాంభీర్యం.. ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమట!

  • Published Dec 30, 2021 | 1:27 PM Updated Updated Dec 30, 2021 | 1:27 PM
TDP,  Acham Naidu, YCP – అచ్చెన్నాయుడు మేకపోతు గాంభీర్యం.. ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమట!

టీడీపీ భవిష్యత్తుపై తరచు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పైకి మాత్రం ఎక్కడా లేని గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. పార్టీ నాయకులు, కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు చిత్ర విచిత్ర స్టేట్‌మెంట్‌లు ఇస్తుంటారు. తాజాగా అదే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పేశారు. గురువారం శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి నాన్న, తాత ముత్తాతలు కూడా టీడీపీని ఏం చేయలేకపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఓటీఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.

ఎప్పుడు బలపడిందట?

పార్టీ లేదూ.. బొక్కా లేదూ అంటూ ఒకసారి, చంద్రబాబు అధికారంలో లేనప్పుడు సోది చెబుతారు. అధికారంలోకి వచ్చాక అధికారుల మాటే వింటారు. పార్టీని పట్టించుకోరు అని మరోసారి వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు టీడీపీ భవిష్యత్తును కళ్లకు కట్టారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన రెండు సందర్భాల్లోనూ పార్టీలో కలకలం రేగడమే కాక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇక జనంలో ఆదరణ ఏముంటుందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి అన్నట్టు వైఎస్సార్‌ సీపీ వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అవుతుందని స్టేట్‌మెంట్‌ ఇచ్చి పార్టీలో జోష్‌ నింపాలని ప్రయత్నం చేశారు.

Also Read : అంతగా భయపడ్డారా..? రామ్మోహన్‌ ఏం చెప్పదలుచుకున్నారు..?

అయితే రాష్ట్రంలో ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్సార్ సీపీకి కనీస పోటీ ఇవ్వలేకపోతున్న టీడీపీ ఏకంగా అధికారం చేపట్టేస్తుందని చెబుతుంటే తెలుగుదేశం నాయకులే నమ్మలేకపోతున్నారు. 2019 తర్వాత పలు ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలైన టీడీపీ.. చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఓటమి పాలై పరువు పోగొట్టుకుంది. దాన్నుంచి జనం దృష్టి మరల్చడానికి అసెంబ్లీలో మహిళలకు అవమానం అంటూ కొన్నాళ్లు హడావుడి చేసినా జనం పట్టించుకోలేదు. అప్పటి నుంచి పార్టీ అధినేత చంద్రబాబు కాని, అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాని, భావి నేత అని భావిస్తున్న లోకేశ్‌ కాని పార్టీ పటిష్టానికి తీసుకున్న చర్యలు శూన్యమని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. అయినా పార్టీ బలపడిపోయినట్టు బిల్డప్‌లు ఇస్తూ వచ్చే ఎన్నికల్లో 151 స్థానాలు పైబడి సాధిస్తాం.. వైఎస్సార్‌ సీపీని సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేస్తాం అని ప్రకటనలు చేసేస్తే టీడీపీ బలపడిపోతుందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జగన్‌ ముత్తాత టైంలో టీడీపీయే లేదు అచ్చెన్నా..

జగన్‌మోహన్‌రెడ్డి నాన్న, తాత ముత్తాతలు కూడా టీడీపీని ఏం చేయలేకపోయారని ఆవేశంగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు జగన్‌ ముత్తాత టైంలో టీడీపీయే లేదన్న సంగతి తెలుసుకుంటే మంచిదని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. తాత ముత్తాతల వరకు ఎందుకు ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన కన్నా వయసులో చాలా చిన్నవాడైన జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చతికిలపడ్డారని గుర్తు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న అచ్చెన్న.. ఆ అవసరం ఎవరికీ లేదని గ్రహించాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణలో బిచాణా ఎత్తేసిన టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ‍కూడా వెంటిలేషన్‌పై ఉందని, ఉనికి కోసం పాట్లు పడుతున్న పార్టీపై దృష్టి పెట్టాల్సిన అవసరం తమ నేత జగన్‌కు లేదని చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని డాంభికాలు పలుకుతున్న అచ్చెన్న అసలు ఆ పార్టీకి జనం ఓట్లేస్తారని భావిస్తున్నారా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము గెలిస్తే ప్రజలకు ఇది చేస్తాం.. అది చేస్తాం అని ఏ పార్టీ అయినా చెబుతుంది కాని,  ఎంతసేపూ పగ, ప్రతీకారాలు తీర్చుకుంటామని చెబుతుండడం ఆ పార్టీ నేతల మైండ్‌సెట్‌కు అద్దం పడుతోందని అంటున్నారు. ప్రజాదరణతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న తమ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవలసిన అవసరం లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు.

Also Read : చింతలపూడి టీడీపీకి నాయకత్వ చింత