iDreamPost
android-app
ios-app

తుంగభద్ర డ్యామ్

  • Published Jan 05, 2020 | 3:11 PM Updated Updated Jan 05, 2020 | 3:11 PM
తుంగభద్ర డ్యామ్

సాగునీటి అవసరాలు,సోషల్ మీడియా ప్రభావము తదితర కారణాలతో నీటి ప్రాజెక్టుల మీద ప్రజలలో గతంలో కన్నా ఎక్కువ ఆసక్తి పెరిగింది,అవగాహన కూడా పెరిగింది. నీటి వనరులు,ప్రాజెక్ట్ వివరాలు ప్రజాప్రతినిధులు విధిగా తెలుసుకోవాలి.ఎక్కడైనా పొరపాటున వివరాలు తప్పుగా మాట్లాడితే ఇబ్బంది పడతారు. నిన్న జరిగిన ఒక సభలో ఒక ప్రజాపతినిధి టీబీ డ్యామ్ ,శ్రీశైలం డ్యామ్ ల గురించి చెప్పిన వివరాలలో పొరపాట్లు ఉన్నాయి. టీబీ డ్యామ్ వివరాలు చూడండి.

Mackenzie అనే British Engineer 1902లో తుంగభద్ర నీటి మీద భారీ ప్రాజెక్టుకు ఒక ప్రణాళిక తయారు చేశారు.దాని ప్రకారం ఇప్పుడు Hospet దగ్గర వున్న డ్యామ్ (తుంగభద్ర డ్యామ్) ను మరికొంత దిగువున అంటే కర్నూల్ జిల్లా మంత్రాలయంకు దగ్గరలో ప్రాజెక్టును నిర్మించి రాయలసీమలోని 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది ఉద్దేశము .

అప్పట్లో బళ్ళారి,హొస్పేట్,కర్నూల్ ప్రాంతాలు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా కొప్పాల్, రాయచూర్, మహబూబ్ నగర ప్రాంతాలు నిజాం హైద్రాబాద్ స్టేట్ లో ఉండేవి. అయితే అప్పటి ఆర్ధిక పరిస్థితి మరియు అంతర రాష్ట సమస్య వలన డ్యామ్ కట్టలేక పోయారు.

1921లో మద్రాస్ ప్రెసిడెన్సీ ,నిజాం ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్  నిర్మాణం చేపట్టారు.ప్రాజెక్ట్ నిర్మాణానికి Mackenzie సూచించిన ప్రాంతం బాగా అనుకూలంగా వున్నా దాని వలన “హోస్పేట్” నగరం ,”హంపి” ముంపునకు గురి అవుతాయని ఎగువన “హోస్పేట్” దగ్గర డ్యాం కట్టించాడు,1945 నాటికి ఒక రూపానికి తెచ్చాడు చివరికి 1953లో పూర్తి అయ్యింది.

ప్రాజెక్టులో మొత్తం 33 గేట్లు ఉండగా కుడి వైవు ఉన్న 17 గేట్లు మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం,ఎడమ వైపు ఉన్న 16 గేట్లను హైద్రాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. నీటి వాటాలో 33.33% మద్రాస్ ప్రెసిడెన్సీకి ,66.66% హైద్రాబాద్ రాష్ట్రానికి కేటాయించారు. విద్యుత్ లో 66 % మద్రాస్ ప్రెసిడెన్సీకి,33.33% హైద్రాబాద్ రాష్ట్రానికి కేటాయించారు. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ ఎక్కువ కరెంటును తీసుకోగా ,హైద్రాబాద్ రాష్ట్రం నీటిని తీసుకుంది.

ప్రాజెక్టులో కుడి వైపు HLC (High level canal/ఎగువ కాలువ),LLC(Low level canal/దిగువ కాలువ) , ఎడమవైపు శ్రీ కృష్ణ దేవరాయలు, బసవేశ్వరుడి పేర్లతో “రాయబసవ” కాలువ ఉంది.

తుంగభద్ర ఎగువ కాలువ(High level canal-HLC ) కాలువ పొడవు 196 కి.మీ.తుంగభద్ర డ్యామ్ నుంచి ఈ కాలువ మొదలై అనంతపురం జిల్లాలో  పెన్నానది మీద కట్టిన  “పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ “(PABR) రిజర్వాయర్లో కలుస్తుంది.మొదటి 105 కి.మీ కర్నాటక-ఆంధ్ర ఉమ్మడికాలువగాను,91 కి.మీ ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. HLCకి మొత్తం 50 TMCల నికరజలాల కేటాయించారు. ఇందులోఆంధ్రప్రదేశ్ వాట 32.5TMCలు .

తుంగభద్ర దిగువ కాలువ(LLC)- 324 కి.మీ పొడువువున్న ఈ కాలువ మొదటి 250 కి.మీ కర్నాటక-ఆంధ్ర ఉమ్మడి కాలువగా,మిగిలిన 74 కి.మీ ఆంధ్రప్రదేశ్లో పారుతుంది. HLC అనంతపురం,కడప జిల్లాలకు సాగుతాగు నీరు అందిస్తుంటే దిగువ కాలువ(LLC) ప్రధానంగా కర్నూల్ జిల్లాకు సాగు & తాగు నీరు అందిస్తుంది.LLC కి మొత్తం 52TMCల నికర జలాల కేటాయింపులు వుండగా అందులో ఆంధ్రాకు 29.5TMCలు కేటాయించారు.

ఇప్పటికి ఎడమ కాలువకు ఒక CE ,SE మరియు EE ఉండగా కుడి కాలువకు ఒక SE ,ఇద్దరు EE(HLC కి ఒకరు,LLC కి మరొకరు) ఉన్నారు. తుంగభద్ర బోర్డు CE నీకుడికాలువకు CE గా వ్యవహరిస్తాడు.

ప్రాజెక్టును మొదట అనుకున్న ప్రదేశంలో కాకుండా ఎగువన Hospet వద్ద కట్టడం వలన రాయలసీమకు అనుకున్నంతగా లబ్ది చేకూరలేదు. ఇప్పటి లెక్కల ప్రకారం తుంగభద్ర మీద “హోస్పేట్” దగ్గర వున్న TB Dam + రాజోలి + సుంకేసుల కలిపి మొత్తం 235TMCల నిలువ సామర్ధ్యం ఉంది. 

HLC నుంచి అనంతపురానికి రావలసినన్ని నీళ్లు రావటం లేదు. LLC పరిస్థితి కూడా అంతే . పశ్చిమ కర్నూల్ సాగు మరియు తాగు నీరు కోసం ఇప్పటికి ఇబ్బంది పడుతుంది. సుంకేసుల డ్యామ్ నుంచి మాత్రం KC Canal కు ఒక మేర నీళ్లు అందుతున్నాయి.

గత నెలలో కుందు నది మీద మూడు పథకాలకు శంకుస్థాపన చేసి ,ఆర్వేటిపల్లి వద్ద కొత్త రిజర్వాయర్ ను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ టీబీ డ్యాం మీద ఆధారపడ్డ HLC మరియు LLC పరివాహక ప్రాంత నీటి కొరతకు ప్రణాళికలు సిద్ధంచేయాలి.