iDreamPost
android-app
ios-app

TamilNadu Governor RN Ravi – తమిళనాట వివాదంగా గవర్నర్ ఆదేశాలు

  • Published Oct 28, 2021 | 8:04 AM Updated Updated Oct 28, 2021 | 8:04 AM
TamilNadu Governor RN Ravi – తమిళనాట వివాదంగా గవర్నర్ ఆదేశాలు

గతంలో భన్వరీలాల్ పురోహిత్ ఇప్పుడు ఆర్.ఎన్. రవి..గవర్నర్లు మారినా, ప్రభుత్వాలు మారినా అవే వివాదాలు. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అప్పటి గవర్నర్ పురోహిత్ ప్రయత్నించగా తాజాగా డీఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త గవర్నర్ రవి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై శాఖలవారీగా సమీక్షించాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. గవర్నర్ల పాత్రపై చర్చకు దారి తీస్తోంది. రాజభవన్ తీరుపై తమిళనాడులో కాంగ్రెస్ సహా పలు పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా,రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇంకా దీనిపై స్పందించలేదు.

బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే..

తమిళనాడు గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎన్.రవి ఈ నెల 18న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలసి వచ్చారు. వచ్చిన మూడు రోజులకే ప్రభుత్వ పథకాలపై సమీక్షకు సిద్ధం కావాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బుకు లేఖ పంపారు. ప్రభుత్వ పథకాల అమలుతీరు, ఆయా శాఖల పనితీరు, అమల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర పథకాల వివరాల గురించి గవర్నర్ సమీక్షించాలని అనుకుంటున్నారు. వాటికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు చేయండి.. సమావేశం జరిగే తేదీ, సమయం మళ్లీ తెలియజేస్తాం అంటూ గవర్నర్ కార్యదర్శి పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అన్ని శాఖల అధికారులకు వెళ్లింది. అయితే దీనిపై ప్రభుత్వ ఉద్దేశం తెలియక అధికారులు సందిగ్ధంలో పడ్డారు.

Also Read : Punjab Amarinder Siddu-సిద్ధూ టార్గెట్ గానే అమ‌రీంద‌ర్ పార్టీ : కాంగ్రెస్‌కు కొత్త క‌ష్టాలు త‌ప్ప‌వా?

అది రాజ్యాంగం విరుద్ధం

గవర్నర్ లేఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ తీరు దురుద్దేశంతో కూడుకున్నదని డీఎంకే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.అళగిరి విమర్శించారు. ఇది ఆశ్చర్యకర పరిణామమని, ప్రభుత్వ పథకాలను సమీక్షించే అధికారం గవర్నర్‌కు లేదని వ్యాఖ్యానించారు. ఆ అధికారం సీఎం, ఆయన మంత్రివర్గానికే ఉంటుందన్నారు. రవి నియామకం సందర్బంగా తలెత్తిన అనుమానాలు నిజమేనని ఆయన చర్యలు రుజువు చేస్తున్నాయన్నారు. కేంద్రం ఏజెంటుగా వ్యవహరిస్తున్న గవర్నర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. కాగా గవర్నర్ తీరు వల్ల రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడి గందరగోళం నెలకొని ప్రమాదం ఉందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ బెన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో పురోహిత్ తీరుపై డీఎంకే నిరసన

రవికి ముందు గవర్నర్‌గా ఉన్న భన్వరీలాల్ పురోహిత్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు డీఎంకే నిరసన తెలిపింది. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న సమయంలో స్వచ్ఛ భారత్ పథకంపై సమీక్షకు అప్పటి గవర్నర్ పురోహిత్ సిద్ధమయ్యారు. జిల్లాల్లో పర్యటించి మరీ సమీక్షలు జరిపారు. ఆయన చర్యలను ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే తప్పుపట్టింది. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు జరిపింది. అలాంటిది ఇప్పుడు తమ ప్రభుత్వానికే ఆ పరిస్థితి ఎదురైతే ఎందుకు ఊరుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ నిర్ణయంపై ఎలా స్పందిస్తారోనన్న చర్చ జరుగుతోంది.

Also Read : తమిళనాడు గవర్నర్ గా మాజీ ఐపీఎస్.. స్టాలిన్ దూకుడుకు కళ్లెం వేసేందుకేనా.. ?