iDreamPost
android-app
ios-app

మతం కన్నా ప్రేమ గొప్పదని చాటిన సినిమా – Nostalgia

  • Published Aug 18, 2021 | 11:03 AM Updated Updated Aug 18, 2021 | 11:03 AM
మతం కన్నా ప్రేమ గొప్పదని చాటిన సినిమా – Nostalgia

భారతదేశానికి వచ్చిన వారెవరైనా తప్పకుండా సందర్శించే టూరిస్ట్ స్పాట్ తాజ్ మహల్. ఒక అద్భుత కట్టడంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న షాజహాన్ కట్టించిన ఈ స్మారకం దగ్గర ఒకప్పుడు షూటింగులు ఎక్కువగానే జరిగేవి కానీ రాను రాను పెరుగుతున్న అవసరాలు, కాలుష్యం దృష్ట్యా ప్రభుత్వం వాటిని నిషేధించడం జరిగింది. దీన్నే టైటిల్ గా పెట్టుకుని వచ్చిన సినిమాలను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగినది 1995లో విడుదలైన తాజ్ మహల్. ఆ విశేషాలు చూద్దాం. 1994లో కృష్ణతో తీసిన ‘ఘరానా అల్లుడు’తో పరిచయమైన దర్శకుడు ముప్పలనేని శివ మతాంతర ప్రేమ నేపథ్యంలో ఒక కథ రాసుకున్నారు.

భారీ బడ్జెట్ సినిమాలను వారసుడు సురేష్ బాబుకి అప్పగించిన డి రామానాయుడు గారు మీడియం రేంజ్ చిత్రాలను మాత్రం తానే స్వయంగా పర్యవేక్షిస్తూ నిర్మాణం కొనసాగించేవారు. అప్పుడు వచ్చిన స్క్రిప్టే ఈ తాజ్ మహల్. శ్రీకాంత్ హీరోగా మోనికా బేడీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ సినిమా స్కోప్ లో తీయాలని నిర్ణయించుకున్నారు. తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఓ కుర్రాడు అక్కడ బొమ్మలు అమ్ముకునే ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించడం, తదనంతరం జరిగే పరిణామాల నేపథ్యంలో మంచి డ్రామా, ఎమోషన్స్ తో జంధ్యాల గారితో ప్రత్యేకంగా సంభాషణలు రాయించి ముప్పలనేని శివ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు.

ప్రొడక్షన్ లో రాజీ పడకుండా సినిమాను హైదరాబాద్ తో పాటు ఆగ్రా, కులు మనాలి తదితర లొకేషన్లలో తీశారు. కేవలం రెండు చిత్రాల అనుభవం ఉన్న ఎంఎం శ్రీలేఖ తాజ్ మహల్ కు మర్చిపోలేని బాణీలు అందించారు. ఇప్పటి అగ్ర గీత రచయిత చంద్రబోస్ కు డెబ్యూతోనే పెద్ద బ్రేక్ దక్కింది. హీరోయిన్ అన్నయ్యగా కరుడుగట్టిన మతభావాలు ఉన్న పాత్రలో శ్రీహరి పెర్ఫార్మన్స్ కి ఉత్తమ సహనటుడిగా నంది అవార్డు దక్కింది. ఢిల్లీలో జరిగిన ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో తాజ్ మహల్ ని ప్రదర్శించారు. 1995 మే 25న ఏ పోటీ లేకుండా విడుదలైన తాజ్ మహల్ సూపర్ హిట్ టాక్ తో వంద రోజులు ఆడింది.

Also Read : అయిదుగురు హీరోల పండగ రేసు – Nostalgia